365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,2024: రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనంలో విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నూతనంగా నియమితులైన ప్రొఫెసర్ అల్థాస్ జానయ్యని కలిశారు.
అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న ఒక BC వ్యక్తిని విశ్వవిద్యాలయానికి మొదటిసారిగా ఉపకులపతిగా నియమించడం చాలా అభినందనీయమని ప్రకాష్ గౌడ్ అన్నారు.
అందుకు ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం ప్రకాష్ గౌడ్ ఉపకులపతి అల్థాస్ జానయ్య, రిజిస్ట్రార్ D. శివాజీ ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో అనేక అంశాల గురించి విపులంగా చర్చించారు. విశ్వవిద్యాలయం భూములు, ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
భూములు రక్షణకు ప్రహరి గోడలని నిర్మించాలన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి తాను అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ నెలలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ వజ్రోత్సవాల గురించి ఉపకులపతి, MLA ప్రకాష్ గౌడ్ కి వివరించారు. వాటిలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.
ఆహ్వానానికి MLA కృతజ్ఞతలు తెలిపారు. వజ్రోత్సవాలకి కచ్చితంగా హాజరవుతానన్నారు. అదేవిధంగా వజ్రోత్సవ పైలాన్ ఏర్పాటుకి సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని దానికి తోడ్పాటు అందించవలసిందిగా ఉపకులపతి ఎమ్మెల్యేని ప్రత్యేకంగా కోరారు.
ఆ నిధుల్ని తన శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తానని ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. పైలాన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి ఉపకులపతి అల్దాస్ జానయ్య ధన్యవాదాలు తెలిపారు.