365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, గచ్చిబౌలి,సెప్టెంబర్ 9,2025: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన పెంచే లక్ష్యంతో ‘డాక్ట్రెస్’ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో 5 కిలోమీటర్ల మారథాన్ నిర్వహించారు. సెప్టెంబర్ 7న ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు, అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
మంత్రి ప్రారంభించి, ప్రశంసించారు
రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, పరుగును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం, ‘డాక్ట్రెస్’ సంస్థ ప్రారంభించనున్న ‘గ్లిడా’ (గ్లోబల్ ఇండియన్ డాక్టర్స్ అలయన్స్) లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వినియోగాన్ని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇది యువత భవిష్యత్తుకు పెను ముప్పు అని హెచ్చరించారు.
వైద్య రంగ నిపుణులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, గ్రామాల వారీగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని, దేవుడిచ్చిన జన్మను సార్థకం చేసుకోవాలని సూచించారు. నిర్వాహకులైన డాక్టర్ కీర్తి, శివలను మంత్రి అభినందించారు.

వైద్యుల ఆరోగ్యం, భద్రతపై దృష్టి
‘డాక్ట్రెస్’ సంస్థ, టీఎస్ న్యాబ్ (TS-NAB),ఈగల్ డిపార్ట్‌మెంట్‌ల సహకారంతో ఈ మారథాన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ప్రముఖులు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తమ నిబద్ధతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా వైద్యులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే వైద్యులపై జరిగే హింసాత్మక దాడులను అరికట్టడంపై సమాజంలో అవగాహన కల్పించాలని నిర్వాహకులు డాక్టర్ శ్రీకీర్తి, ఆకుల శివకృష్ణ తెలిపారు.
అధికారుల భాగస్వామ్యం, యువతకు పిలుపు
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి పద్మావతి, నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన వడ్డే నవీన్, సందీప్ శాండిల్య పాల్గొన్నారు. నార్కోటిక్స్ బ్యూరో విభాగం చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ, డ్రగ్స్‌ను నిషేధించి, నవ సమాజాన్ని నిర్మించాలని యువతను పిలిచారు. ఎల్. శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత సైనికుల వలె మాదక ద్రవ్యాలపై యుద్ధం చేయాలని, వ్యక్తిగతంగా, సామాజికంగా బాగుంటేనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు.
Read This also…Samsung Oven Faces Customer Outrage: “Not for Baking, Just a Warmer,” Alleges User..
స్పోర్ట్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ కొలను జగ్ జీవన్ రెడ్డి, వివిధ ఆసుపత్రుల వైద్యులు కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొన్న వారికి ‘డాక్ట్రెస్’ సంస్థ మెడల్స్, జ్ఞాపికలను బహుకరించింది.