Thu. Nov 21st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 19,2023: టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. టమాటా ధర రేంజ్ ను మరికొన్ని కూరగాయల ధరలు దాటిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా, ప్రతి ఇంటి వంటగది బడ్జెట్ పై భారం పడుతోంది.

కొత్తిమీర కూడా కిలో రూ.200కు మించి విక్రయిస్తున్నారు. కిలో అల్లం రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు కూరగాయల వ్యాపారులు వెల్లడిస్తున్నారు. వెల్లుల్లి కిలో రూ.200 ఉంటే, బీన్స్ కూడా కిలో రూ.160 దాటింది. పచ్చిమిర్చి కూడా ప్రస్తుతం కిలో రూ.100 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు.

పలు చోట్ల టమాటా ధరలు మాత్రం రూ.250 నుంచి రూ.150కి తగ్గాయి. అయినప్పటికీ, ఏప్రిల్-మేతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా మధ్యతరగతి వినియోగదారులకు టొమాటో ఇప్పటికీ దూరంగా ఉంది.

ఈ కారణంగా, చాలా మంది ప్రజలు టమోటాలు కొనడం తగ్గించగా , మరికొందరైతే మానేశారు. కూరగాయల ధరలు ,పండ్ల ధరలు పెరగడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాపిల్స్ ధర ప్రస్తుతం రూ.2,200 ఉండగా, గతంలో ఒక్కో బాక్సు రూ.1,200 నుంచి రూ.1,500 వరకు విక్రయించారు.

రవాణా వ్యవస్థ ప్రభావితమైంది..

ఉత్తర భారతదేశంలో కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయలు దెబ్బతిన్నాయి. అందుకే ధరలు మరింతగా పెరుగుతున్నాయి. భారీ వర్షాలు వరదల కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతదేశం నుంచి కూరగాయల సరఫరా ఖర్చు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఇటీవల వరదలు, కొండచరియలు విరిగిపడటం, పంట నష్టం కారణంగా కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ధనవంతులవుతున్న రైతులు..

టమాటా ధరల పెరుగుదల కొంత మంది రైతులను ధనవంతులను చేసింది. మహారాష్ట్రలోని జున్నార్ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఈశ్వర్ గైకర్ మాట్లాడుతూ.. తాను, తన భార్య సోనాలి ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రూ.2.4 కోట్ల లాభాన్ని ఆర్జించగా, ఏడాది క్రితం రూ.15 లక్షల లాభం వచ్చిందని చెప్పారు.

ఈ రైతు 12 ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నాడు. ఆహార మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆదివారం ఢిల్లీలో టమోటా రిటైల్ ధర కిలో రూ.178గా ఉంది. ఇది జనవరి 1తో పోలిస్తే 700 శాతం ఎక్కువ.

దెబ్బతిన్న కూరగాయల పంటలు..

ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు కారణంగా అనేక కూరగాయల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. టొమాటోలో ఎక్కువ భాగం హిమాచల్ నుంచి వస్తుంది. ఇది తీవ్రంగా ప్రభావితమైంది. అధిక వర్షాల కారణంగా, రాజస్థాన్ , హర్యానాలోని మైదానాలలో చాలా చోట్ల బీరకాయ, పొట్లకాయ ,బెండ పంటలు దెబ్బతిన్నాయి.

దీంతో కూరగాయల ధరలపై తీవ్రంగా ప్రభావం పడింది. ఇది ఇలాగే కొనసాగితే కూరగాయల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. టమాటా ధరల పెరుగుదల కొంత మంది రైతులను ధనవంతులను చేయడం విశేషం.

error: Content is protected !!