365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ పనాజి, గోవా, 7,2025: పర్యాటక కేంద్రంగా పేరొందిన గోవాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా (Arpora) గ్రామ సమీపంలోని బాగా బీచ్‌కు దగ్గరగా ఉన్న ఓ ప్రముఖ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక, ఆదివారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 23 మంది దుర్మరణం పాలయ్యారు.

పోలీసులు, అగ్నిమాపక శాఖ వర్గాల సమాచారం ప్రకారం… ‘బిర్చ్ బై రోమియో లేన్’ (Birch by Romeo Lane) అనే నైట్‌క్లబ్ రెస్టారెంట్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దుర్ఘటన జరిగింది.

వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఒక్క పేలుడుతో క్లబ్‌లోని కిచెన్ ఏరియా నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి.

బాధితుల్లో ఎక్కువ మంది సిబ్బందే..

మృతుల్లో ఎక్కువ మంది క్లబ్‌లో పనిచేసే వంటగది సిబ్బందే ఉన్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని, మూడు నుంచి నలుగురు పర్యాటకులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. మంటల ధాటికి కొందరు కాలిపోగా, మరికొందరు పొగ పీల్చడం వల్ల ఊపిరాడక చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

సీఎం పరామర్శ, విచారణకు ఆదేశం..

ప్రమాదం గురించి తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. సమగ్ర విచారణకు ఆదేశించారు.

క్లబ్‌లో అగ్నిమాపక భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే విషయాన్ని కూపీ లాగుతామని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రధాని సంతాపం..

ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గోవా ముఖ్యమంత్రితో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ అగ్నిప్రమాదం గోవా పర్యాటక రంగంలో భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.