365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ ,సెప్టెంబర్ 4,2025: కేంద్ర ప్రభుత్వం GST రేట్లలో భారీ మార్పులను చేసింది. ఈ మార్పులతో సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారస్తులు ఉపయోగించే వందలాది వస్తువులు,సేవలు చౌకగా మారాయి. ఇప్పుడు GST కేవలం 5%,18% అనే రెండు ప్రధాన రేట్లు మాత్రమే ఉంటాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ మార్పులు చేయడం జరిగింది.

  1. కొత్త GST రేట్లు ఎప్పటి నుండి అమలులోకి వస్తాయి?
    చాలా వస్తువులు,సేవలపై కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22, 2025 నుంచి అమలులోకి వస్తాయి. అయితే, సిగరెట్లు,కొన్ని పొగాకు ఉత్పత్తులపై కొత్త రేట్లు తరువాత నోటిఫై చేయబడిన తేదీన అమలులోకి వస్తాయి.
  2. వైద్య రంగంలో GST రేట్లు ఎలా మారాయి?
    అన్ని మందులు, ఔషధాలపై 5% రాయితీ GST రేటు వర్తిస్తుంది. దీనివల్ల ఉత్పత్తిదారుల వ్యయాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్యాన్సర్ మందులపై జీరో శాతం GST వర్తిస్తుంది. గతంలో 18% ఉన్న ఆరోగ్య ,జీవిత బీమాపై GST పూర్తిగా తొలగించబడింది.
  3. అందం, ఫిట్‌నెస్ సేవలపై GST ఎంత?
    హెల్త్ క్లబ్లు, సెలూన్లు, బార్బర్లు, ఫిట్‌నెస్ సెంటర్లు,యోగా సేవలపై గతంలో 18% ఉన్న GST రేటును ఇప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లేకుండా 5%కి తగ్గించారు.
  4. చిన్న కార్ల GST రేటు ఎంత?
    అన్ని చిన్న కార్లపై GST రేటు 28% నుంచి 18%కి తగ్గింది. ఇది 1200సీసీ లోపు పెట్రోల్/సీఎన్జీ/ఎల్పీజీ కార్లకు,1500సీసీ లోపు డీజిల్ కార్లకు వర్తిస్తుంది. అలాగే, 350సీసీ లోపు బైక్‌లకు కూడా GST తగ్గింది.
  5. వ్యవసాయ యంత్రాలపై GST రేటు ఎందుకు తగ్గించారు?
    రైతులకు ఉపశమనం కలిగించేందుకు స్ప్రించ్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్,కోత యంత్రాలపై GST రేటును 12% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు,వాటి టైర్లపై కూడా 5% పన్ను వర్తిస్తుంది.
  6. ఏసీ,టీవీల కొత్త ధరలు ఏమిటి?
    ఎయిర్ కండిషనర్,డిష్‌వాషర్‌పై GST రేటును 28% నుంచి 18%కి తగ్గించారు. అన్ని టీవీలు,మానిటర్లు, వాటి సైజుతో సంబంధం లేకుండా, ఇప్పుడు 18% పన్ను పరిధిలోకి వస్తాయి. ఇంతకు ముందు పెద్ద స్క్రీన్ టీవీలపై 28% పన్ను ఉండేది.
  7. హోటల్స్‌పై GST రేటు ఎంత?
    ప్రతి రోజుకు ₹7500 లోపు ఉండే హోటల్ వసతి సేవలపై GST రేటును 18% నుంచి 5%కి తగ్గించారు.
  8. గ్యాంబ్లింగ్,ఆన్‌లైన్ గేమింగ్‌పై కొత్త GST రేటు ఎంత?
    బెట్టింగ్, క్యాసినో, గ్యాంబ్లింగ్, గుర్రపు పందాలు, లాటరీలు ,ఆన్‌లైన్ మనీ గేమింగ్‌తో సహా అన్ని నిర్దిష్ట చర్యలకు 40% కొత్త GST రేటు వర్తిస్తుంది.
  9. అద్దాలు,గాగుల్స్ పై GST ఎంత?
    దృష్టిని మెరుగుపరిచే కళ్లద్దాలు,గాగుల్స్ పై ఇప్పుడు 5% GST వర్తిస్తుంది. ఇతర రకాల గాగుల్స్ పై 18% పన్ను వర్తిస్తుంది.
  10. ఖరీదైన వస్తువులపై కొత్త రేటు ఏమిటి?
    1500సీసీ లేదా నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న లగ్జరీ కార్లు, పొగాకు, సిగరెట్లు,ఇతర విలాసవంతమైన వస్తువుల కోసం 40% కొత్త స్లాబ్ ఏర్పాటు చేయనుంది. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు ,బీడీలపై కూడా కొత్త రేట్లు వర్తిస్తాయి.

ఈ GST రేట్ల మార్పులతో ప్రభుత్వం పన్ను ఆదాయంలో సంవత్సరానికి ₹47,700 కోట్ల తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ చర్యతో సామాన్య ప్రజలకు,చిన్న వ్యాపారస్తులకు పెద్ద ఉపశమనం లభించనుంది.