Sat. Jul 20th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 18,2024:కలల ఇంటిని కొనుగోలు చేద్దామనుకునే వేతన జీవులకు (ఉద్యోగులకు), సాధారణంగా గృహ రుణాల ప్రక్రియలో ఉండే సంక్లిష్టతలు కాస్త భయపెట్టేవిగా ఉంటాయి.

అయితే, ప్రాథమికాంశాలను అర్థం చేసుకోగలిగితే ఈ ప్రక్రియను సులువుగా పూర్తి చేసేందుకు వీలుంటుంది.

ఇంటి కొనుగోళ్లకు రుణ సదుపాయం కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందించే గృహ రుణాలు ఎంతగానో ప్రాచుర్యంలో ఉన్నాయి. వీటికి సాధారణంగా సదరు ప్రాపర్టీయే హామీగా ఉంటుంది.

క్రెడిట్ స్కోరు, ఆదాయం, ప్రాపర్టీ విలువను బట్టి ఎంత వరకు గృహ రుణం లభించవచ్చనేది ఆధారపడి ఉంటుంది.  అసలు మొత్తం, అలాగే వడ్డీ కూడా కలిపి చేసే చెల్లింపుల వ్యవధి నెలవారీ ప్రాతిపదికన 15, 20 లేదా 30 ఏళ్ల వ్యవధి వరకు ఉంటుంది.

 “ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా తమ సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా వేతన జీవులు ఆర్థిక తోడ్పాటును పొందేందుకుగృహ రుణం అనేది అందుబాటులో ఉన్న ఒక ఆచరణాత్మక మార్గం కాగలదు అని పిరమాల్ ఫైనాన్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ జగ్‌దీప్ మల్లారెడ్డి తెలిపారు.

గృహ రుణ దరఖాస్తు ప్రక్రియలో అర్హతా ప్రమాణాలు చాలా కీలకపాత్ర పోషిస్తాయి. సాధారణంగా దరఖాస్తుదారుల వయస్సు  23 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిర్దిష్ట ప్రారంభ పరిమితికి మించి స్థిరమైన ఆదాయం ఉండాలి. గృహ రుణానికి అర్హత పొందాలంటే సాధారణంగా 750కి పైగా క్రెడిట్ స్కోరు అవసరమవుతుంది.

గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారు తమ ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకునేందుకు వివిధ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. గుర్తింపు ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ప్రాపర్టీ-సంబంధిత డాక్యుమెంట్లు మొదలైనవి వీటిలో ఉంటాయి.

మిగతా రుణాలతో పోలిస్తే వేతన జీవులకు సంబంధించి గృహ రుణాల ప్రక్రియ సూటిగా, స్పష్టంగా ఉంటుంది. ఆర్థిక పత్రాలు అన్నింటినీ దగ్గరుంచుకుని,  రుణదాత ఇచ్చే అప్లికేషన్ ఫారంను పూర్తి చేయడంతో ఇది మొదలవుతుంది.

దరఖాస్తును సమర్పించిన తర్వాత రుణమిచ్చే సంస్థ (లెండర్), సదరు దరఖాస్తుదారు. అర్హతను మదింపు చేస్తుంది.

దరఖాస్తును ఆమోదించిన మీదట రుణ షరతులను వివరిస్తూ శాంక్షన్ లెటర్ జారీ చేస్తుంది. రుణ మొత్తాన్ని విడుదల చేయడానికి ముందు, మరోసారి అన్ని పత్రాలను కచ్చితత్వం కోసం ధృవీకరించుకుంటుంది.

అదనపు చార్జీల భారం పడకుండా చూసుకునేందుకు, ముందస్తుగా తిరిగి చెల్లించేసి రుణ ఖాతాను క్లోజ్ చేసేందుకు సకాలంలో చెల్లింపులు జరపడమనేది చాలా ముఖ్యం.

గృహ రుణాన్ని ఎంచుకోవడమనేది వేతన జీవులకు పలు ప్రయోజనాలను కల్పిస్తుంది. వ్యక్తిగత ప్రాధాన్యతను బట్టి ఫిక్సిడ్ లేదా అడ్జస్టబుల్ రేట్ల ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా తక్కువ వడ్డీ రేటుతో గృహాన్ని కొనుగోలు చేయడం కొంత సులభతరమవుతుంది. ఇతరత్రా రుణాలతో పోలిస్తే గృహ రుణాల మంజూరు చాలా వేగవంతంగా ఉంటుంది.

చాలా సందర్భాల్లో 48 గంటల్లోగానే నిధులు విడుదలవుతాయి. ఇక మరణం లేదా వైకల్యం వంటి ఊహించని పరిస్థితులకు సంబంధించి హోమ్‌ఓనర్‌షిప్‌తో ముడిపడి ఉండే రిస్కులను తగ్గించేలా ఆర్థిక సంస్థలు ఇన్సూరెన్స్ కూడా అందిస్తాయి.

అలాగే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద డిడక్షన్లతో పాటు గృహ రుణాలతో పన్నుపరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. తద్వారా రుణ గ్రహీతలు పన్ను భారాన్ని ఆదా చేసుకోవచ్చు.

చివరిగా చెప్పేదేమిటంటే, ఇంటి కొనుగోలు యోచనలో ఉన్న వేతన జీవులు ముందుగా గృహ రుణాలకు సంబంధించిన ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

అర్హతా ప్రమాణాలు, అవసరమయ్యే డాక్యుమెంట్లు, గృహ రుణాలతో ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటి గురించి తెలుసుకోవడం వల్ల వేతన జీవులు తమ సొంతింటి కలను సాకారం చేసుకునే దిశగా ధీమాగా అడుగులు వేయొచ్చు.

గృహ రుణాలనేవి వేతన జీవుల ఇంటి కొనుగోలు లక్ష్య సాధనకు అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందిస్తాయి. వీటి సహాయంతో ఇంటిని కొనుగోలు చేయడం ద్వారా వేతన జీవులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు.

Also read :Essential Guide to Home Loans for Salaried Employees