365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, ఆగస్టు 24,2025 : ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) తీసుకున్న తర్వాత, క్లెయిమ్ చేసుకునే సమయంలో చాలా మంది పాలసీదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటారు.

క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) సంస్థల పాత్ర కీలకం. అయితే, కొన్నిసార్లు టీపీఏ సంస్థలు సరిగ్గా సహకరించకపోవడం లేదా క్లెయిమ్‌ను అకారణంగా తిరస్కరించినట్లు ఫిర్యాదులు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాలలో, పాలసీదారుడు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరు ఈ టీపీఏ..?

హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో టీపీఏ అంటే థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్. ఇది బీమా కంపెనీల కోసం క్లెయిమ్‌లను పరిశీలించి, పరిష్కరించే ఒక స్వతంత్ర సంస్థ. ఇన్సూరెన్స్ కంపెనీ తరపున పనిచేయడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఈ సంస్థలకు లైసెన్స్ జారీ చేస్తుంది.

ఒక పాలసీదారునికి వైద్య అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, నేరుగా బీమా కంపెనీకి కాకుండా, టీపీఏకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీపీఏలో నిపుణులైన వైద్యులు, బీమా సలహాదారులు మరియు న్యాయ నిపుణుల బృందం ఉంటుంది.

టీపీఏ పాత్ర ఇదే..

క్లెయిమ్‌ను ఆమోదించడంలో టీపీఏ కీలక పాత్ర పోషిస్తుంది. క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు, టీపీఏ నేరుగా ఆసుపత్రితో సంప్రదిస్తుంది.

అదే రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల విషయంలో, వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులను, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. క్లెయిమ్‌లో ఏదైనా తేడా కనిపిస్తే, టీపీఏ ఆసుపత్రిని సంప్రదించి, నిర్ధారణ చేసుకున్న తర్వాత క్లెయిమ్‌ను తిరస్కరించే అధికారం ఉంటుంది.

టీపీఏను మార్చవచ్చా..?

మీరు టీపీఏ సేవలు, పనితీరు పట్ల సంతృప్తిగా లేకపోతే, దాన్ని మార్చుకునే అవకాశం మీకు ఉంటుంది. ఇందుకోసం మీరు నేరుగా మీ బీమా కంపెనీని సంప్రదించి ఫిర్యాదు చేయాలి. మీ టీపీఏను ఎందుకు మార్చాలనుకుంటున్నారో వివరంగా కంపెనీకి తెలియజేయాలి.

మీ అభ్యర్థనను కంపెనీ అంగీకరిస్తే, వారు సూచించే జాబితా నుంచి మీరు మరో టీపీఏను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధంగా, పాలసీదారులు క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించుకోవచ్చు.