365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్18, 2021: భారతదేశపు ప్రాచీన సంప్రదాయం, సంస్కృతిని యువత ప్రోత్సహించి, ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే మన జాతీయ విలువను కాపాడాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. సమాజంలోని వివిధ సామాజిక విభజనలకు అతీతంగా, భారతదేశంలో బహుళత్వ సంస్కృతి ప్రజలను ఏకం చేసే శక్తిని కలిగి ఉందని ఆయన అన్నారు.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ‘అలై బలాయ్’ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ పార్టీలనాయకులు పాల్గొన్నారు. ప్రజలలో సౌభ్రాతృత్వం, సోదరభావాన్నిపెంపొందించడానికి సంవత్సరాలుగా ‘అలై బలాయ్’ నిర్వహిస్తున్నందుకు ఉపరాష్ట్రపతి దత్తాత్రేయను అభినందించారు.
ఈ సందర్భంగా స్వరాజ్ ఉద్యమ సమయంలో ప్రజలను ఏకం చేయడానికి గణేష్ చతుర్థి వేడుకలను ప్రారంభించిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ వారసత్వాన్ని నాయుడు గుర్తు చేసుకున్నారు. గొప్ప నాయకుల వారసత్వాన్ని గౌరవించాలని , భారతదేశ బహుళ సంస్కృతిని రక్షించడానికి వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
హర్యానా గవర్నర్,బండారు దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, సినీ నటులు పవన్ కళ్యాణ్ , డా. రెడ్డి ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జివి ప్రసాద్, భారత్ బయోటెక్ కృష్ణ ఎల్ల ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఛైర్మన్ & వ్యవస్థాపకుడు, డా. నాగేశ్వర్ రెడ్డి, బయోలాజికల్ మేనేజింగ్ డైరెక్టర్, మహిమ దాట్ల తదితరులు పాల్గొన్నారు.