365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 24,2025: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు గ్రామం సమీపంలో, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు (వోల్వో) భీకర అగ్నిప్రమాదానికి గురైంది.
ఈ ఘోర దుర్ఘటనలో ప్రయాణికుల్లో ఇరవై మందికి పైగా సజీవదహనం అయినట్లు సమాచారం. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉండగా, కొందరు అత్యవసర ద్వారం ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు.
ప్రమాదం జరిగిన తీరు గురించిన వివరాలు స్థానికులను,అధికారులను కలచివేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రైవేట్ వోల్వో బస్సు 44వ జాతీయ రహదారి (NH-44)పై వేగంగా వెళ్తుండగా, చిన్న టేకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు బైక్ బస్సు కిందకు దూసుకెళ్లి, ఇంధన ట్యాంక్‌కు తగలడంతో క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. బస్సు ఏసీ కావడంతో మంటలు అంతటా వ్యాపించి, ప్రయాణికులకు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది.
మృతుల్లో బైక్ రైడర్ కూడా..
ఈ ప్రమాదంలో బైక్ రైడర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. సజీవదహనం అయిన 22 మందిలో బైక్ రైడర్ ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రాణాలతో బయటపడినవారు..
బస్సులో ఉన్న దాదాపు 41 మందిలో కేవలం 10 మంది ప్రయాణికులు మాత్రమే బస్సు అద్దాలు పగులగొట్టి, అత్యవసర ద్వారం నుంచి బయటపడగలిగారు. స్వల్ప గాయాలైన వీరిని వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు మంటల్లో చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి..
ఘటన గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బిజెపి నాయకులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రస్తుత పరిస్థితి..
ఘటనా స్థలంలో బస్సు పూర్తిగా కాలిపోయి, కేవలం అస్థిపంజరంలా మిగిలిపోయింది. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
