365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 18, 2025: హుస్సేన్ సాగర్ నాలా సమీపంలో ఉన్న దోమలగూడ గగన్ మహల్ కాలనీలో నివసిస్తున్న మాకు ఇక్కడి సమస్యలు జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దోమలగూడ నుంచి అశోక్ నగర్‌కు కనెక్టివిటీ కోసం ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.
కానీ, ఈ నిర్మాణంలో వచ్చిన చెత్త, శిథిలాలను నేరుగా నాలాలోనే పారవేశారు. గత పదేళ్లుగా ఈ నాలా పూడికను సమర్థవంతంగా తొలగించలేదు. పూడిక తీసినట్లు చూపించినా, నిజానికి ఇసుక, చెత్తను కేవలం పక్కకు తప్పించి వదిలేశారు.

నాలాలో 6 నుంచి 10 అడుగుల లోతు వరకు ఇసుక, చెత్త మేటలుగా పేరుకుపోయాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటికే నాలుగుసార్లు అపార్ట్‌మెంట్‌ల మొదటి అంతస్తు వరకు నీరు చేరింది.
నాలా పూడికను క్రమం తప్పకుండా తొలగిస్తే, కాలనీలోకి నీరు చేరే సమస్య నివారణ అవుతుంది. అమీర్‌పేట్‌లో యుద్ధప్రాతిపదికన నాలా పూడిక తొలగించిన తీరును ఇక్కడ కూడా అమలు చేయాలి.
మా కాలనీ నివాసుల ఆవేదనను అధికారులు గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నాలాలో ఇసుక, చెత్తను తొలగించకపోతే, మరోసారి మా కాలనీ మొత్తం ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దయచేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించండి.