365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 29,2024: ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా. హిప్నో పద్మా కమలాకర్, పిల్లల అల్లరే వారి శక్తి సామర్థ్యాలను బయటపెడతాయని తెలిపారు. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ వేదికపై బాలల మహోత్సవం కార్యక్రమంలో బాలలు మానసిక ఆరోగ్యం పై చర్చా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “బాలల మానసిక ఆరోగ్యం దేశ భవిష్యత్తుకు బలమైన మూలస్థంభం” అని పేర్కొన్నారు. అలాగే, “దేశ భవిష్యత్తు బాలలపై ఆధారపడి ఉందనే వాస్తవాన్ని మనం గుర్తించాలి” అని ఆమె సూచించారు.

పిల్లల వికసిస్తున్న సామర్థ్యాలను తల్లిదండ్రులు సరైన శ్రద్ధతో పెంపొందిస్తే, వారు ఏదైనా సాధించగలరని డా. పద్మా కమలాకర్ అన్నారు. ఆమె మాట్లాడుతూ, “పిల్లల్లో తెలివితేటలు, ఊహాత్మకత అపారంగా ఉంటాయి. వారు తెలిసినదాన్ని చురుకుగా, నైపుణ్యంతో చేసి చూపిస్తారు” అని తెలిపారు. చిన్నారి పిల్లలను మట్టి ముద్దుగా తీర్చిదిద్దడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషి అని ఆమె స్పష్టం చేశారు.

పిపిఎఐ సంఘ ప్రధాన కార్యదర్శి డా. జి. వీరభద్రం, పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం ఎంత అవసరమో, మానసిక ఆరోగ్యంకూడా అంతే అవసరమని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పిల్లలకు ఆరోగ్యం కల్పించే వాతావరణం అందించాలని ఆయన అన్నారు. “పిల్లల భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది” అని ఆయన తెలిపారు.

సంఘ వైస్ ప్రెసిడెంట్ డా.వి.జే.ఇ. క్యార్లన్ మాట్లాడుతూ, బాల్యం జీవితంలో ముఖ్యమైన దశ అని చెప్పారు. వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రేమ, స్నేహం, మర్యాద అవసరమని పేర్కొన్నారు.

బాలోత్సవ నిర్వాహకులు చొక్కాపు వెంకటరమణ, “బాలల మనస్సులు వికసించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలి” అని పిలుపునిచ్చారు. సంఘ కార్యదర్శి డా. పి. రమేష్ కుమార్, పిల్లలపై పడే ఒత్తిళ్లతో పాటు తల్లిదండ్రుల నిర్లక్ష్యమూ మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్నారు. “వారి సమస్యలను అర్థం చేసుకోవడం ద్వారా, పిల్లలతో మాట్లాడాలి” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో దంతవైద్యులు డా. విజయ లక్ష్మీ, చొక్కాపు వెంకటరమణ, సైకాలజిస్టులు డా.వి.జే.ఇ. క్యార్లన్, డా.రమేష్ కుమార్, డా. దీక్షితులు, జయశ్రీ, సుహాసిని, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.