365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 17, 2025: పాత ముంబై హైవే దారిలోని షేకేపేటలో శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం జరిగిన డ్యూక్స్ అవెన్యూ భవనాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను అక్కడి హైడ్రా drf, ఫైర్ బృందాలను అడిగి తెలుసుకున్నారు.

అగ్నిప్రమాదం చోటు చేసుకున్న రెండో అంతస్తుని పరిశీలించారు. ఆకాశ్ ఇనిస్టిట్యూట్ న‌డుస్తున్న రెండో అంత‌స్తు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్ని ప్రమాద సమాచారం తెలియగానే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళం తో పాటు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మంటలను రెండో అంతస్తు కే పరిమితం చేసారు.

రెండంతస్తుల సెల్లార్ తో పాటు నాలుగు పై అంతస్తుల భవనం మొత్తం పొగ వ్యాపించిందని.. రెండో అంతస్తులో వున్న ఆకాశ్ శిక్షణ కేంద్రం బాగా దెబ్బ తినిందని అక్కడ ఫైర్, drf బృందాల కమిషనర్ కు తెలిపారు.

సీసీ టీవీ ఫూటజీని పరిశీలించి అగ్ని ప్రమాదానికి కారణాలను పరిశీలించాలని ఆదేశించారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో యీ ఘటన జరిగినప్పుడు విద్యార్థులు అందులో లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అగ్ని ప్రమాదం ప్రారంభంలోనే అప్రమత్తం చేసే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని భ‌వ‌న య‌జ‌మానుల‌కు సూచించారు. నిప్పు రాజుకున్న క్షణాల్లో ఆ సమాచారం హైడ్రా DRF కు చేరేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచుకోవాలన్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించుకోవడంతో పాటు యితర ఉత్తమ పద్ధతుల ను పాటించాలని సూచించారు.డీఆర్ ఎఫ్‌, ఫైర్ విభాగాల‌కు ఫైర్ అలార‌మ్ వ‌చ్చే వ్య‌వ‌స్థ ఉంటే ప్ర‌మాదాలు చాలావ‌ర‌కు త‌గ్గించ‌వ‌చ్చున‌న్నారు.

శుక్ర‌వారం జ‌రిగిన ఘ‌ట‌న‌లో డీఆర్ ఎఫ్, ఫైర్ సిబ్బంది వెంట‌నే స్పందించ‌డంతో న‌ష్టాన్ని కొంత‌మేర త‌గ్గించార‌ని అన్నారు. ఆకాశ్ ఇనిస్టిట్యూట్ మొత్తం 7500ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో రెండో అంత‌స్తులో ఉంద‌ని అక్క‌డి సిబ్బంది తెలిపారు.