365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 3, 2025 : నగరంలోని చెరువుల అభివృద్ధి పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం స్వయంగా పరిశీలించారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట, పాతబస్తీలోని భమ్రుక్నుద్దౌల చెరువుల పనులను నిశితంగా గమనించిన కమిషనర్, స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సూచనలు, సంతోషాన్ని పంచుకున్నారు.
బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం: స్థానికుల హర్షం..
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులపై స్థానికులు వ్యక్తం చేసిన సంతోషం అంబరాన్నంటింది. “బతుకమ్మ కుంటకు ప్రాణం పోశారంటూ” స్థానిక ప్రజలు హైడ్రా కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Read This also…HAMLEYS BRINGS ITS ICONIC MAGIC TO KUWAIT WITH GRAND OPENING AT THE AVENUES MALL
ఇది కూడా చదవండి…ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

చెరువులో తిరుగాడుతున్న నీటి బాతులను చూపించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుంటలోకి వర్షపు నీరు చేరే ఇన్‌లెట్, చెరువు నిండిన తర్వాత నీరు బయటకు వెళ్లే ఔట్‌లెట్‌లను కమిషనర్ పరిశీలించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలనే విషయాన్ని కూడా ఆయన పరిశీలించారు.
బతుకమ్మ కుంట పక్కన సాగుతున్న మురుగు, వరద కాలువ డైవర్షన్ పనులను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూసీ పరీవాహకంలో మట్టి పోస్తున్నారనే ఫిర్యాదులపై స్పందించిన కమిషనర్, ఇప్పటికే సంబంధిత వ్యక్తులను హెచ్చరించినట్లు తెలిపారు.
“వారం రోజుల్లో వారికి వారే మట్టిని తీసేస్తామని హామీ ఇచ్చారు. వారం తర్వాత మూసీ పరీవాహకంలో వేసిన మట్టిని తొలగించకపోతే వారిపై కేసులు పెడతాం” అని శ్రీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
భమ్రుక్నుద్దౌల చెరువుకు విముక్తి: పార్కు ఏర్పాటుకు పరిశీలన..
పాతబస్తీలోని 18 ఎకరాల భమ్రుక్నుద్దౌల చెరువు అసలు విస్తీర్ణం కాగా, 9 ఎకరాల మేర మట్టి నింపి ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ 9 ఎకరాల్లోని మట్టిని తొలగించి చెరువును పునరుద్ధరిస్తున్న హైడ్రా పనులను కమిషనర్ పరిశీలించారు. చెరువు ఔట్‌లెట్‌ను తెరిపించేందుకు గల అవకాశాలను కూడా ఆయన పరిశీలించారు.
స్థానికులు కమిషనర్‌ను కలిసి చెరువు అభివృద్ధి పనుల పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ పార్కును కూడా ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కమిషనర్, చెరువు అభివృద్ధిలో భాగంగా పిల్లల ఆట స్థలం (చిల్డ్రన్స్ ప్లే ఏరియా), చెరువు చుట్టూ పాత్‌వే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
“చెరువు తయారవుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడకు రావాలంటే గతంలో భయం వేసేది.. మురుగునీటితో నిండిన కుంట వల్ల దోమలు వచ్చేవి. ఇప్పుడు ఈ పరిసరాలు ఆహ్లాదంగా తయారవుతున్నాయి.. హైడ్రాకు ధన్యవాదాలు” అని స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చెరువు కబ్జా కాకుండా కాపాడారని వారు హైడ్రాను కొనియాడారు.