365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 23, 2025: అంతర్జాతీయ సైక్లింగ్ రంగంలో భారత కీర్తి పతాకాన్ని అగస్తీ చంద్రశేఖర్ మరోసారి రెపరెపలాడించారు. అమెరికాలోని ఓక్లహోమా సిటీ (తులసా)లో నవంబర్ 26 నుండి 30 వరకు జరిగిన ప్రతిష్టాత్మక ‘యూఎస్‌ఏ గ్రాండ్ నేషనల్స్’ పోటీల్లో 16 ఏళ్ల అగస్తీ 4వ స్థానంలో నిలిచి అద్భుత ప్రదర్శన చేశారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 48 మంది అత్యుత్తమ రైడర్లతో పోటీపడి అగస్తీ ఈ ఘనత సాధించడం విశేషం.

భారత BMX రేసింగ్ పితామహుడు

భారతదేశం నుండి BMX రేసింగ్ విభాగంలో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఏకైక రేసర్‌గా అగస్తీ చరిత్ర సృష్టించారు. 2023 నుండి దేశం తరపున వరుసగా అంతర్జాతీయ పతకాలు గెలుచుకుంటూ, ఈ క్రీడలో భారత్‌ను గ్లోబల్ మ్యాప్‌పై నిలిపారు.

ఒలింపిక్ విజేత శిక్షణలో..

భారతదేశంలో సరైన BMX ట్రాక్‌లు లేనప్పటికీ, అగస్తీ పట్టుదలతో మలేషియా మరియు అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. 2016 రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ప్రపంచ ఛాంపియన్ కానర్ ఫీల్డ్స్ పర్యవేక్షణలో అగస్తీ మెరుగులు దిద్దుకుంటున్నారు.

“ప్రపంచంలోని అతిపెద్ద వేదికపై భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి, 4వ స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉంది. దేశం కోసం పతకాలు గెలవడమే నా లక్ష్యం” అని అగస్తీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అప్రతిహత విజయ పరంపర

ఈ ఏడాది అగస్తీ ప్రదర్శన అమోఘంగా సాగింది:

  • అరిజోనా నేషనల్స్: 4 స్వర్ణాలు, 1 రజతం.
  • నెవాడా స్టేట్ ఛాంపియన్‌షిప్: బంగారు పతకం.
  • మలేషియా నేషనల్స్: తొలిసారిగా భారత్ తరపున రజత పతకం సాధించిన చరిత్ర.

లక్ష్యం: 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్

అగస్తీ తల్లిదండ్రులు చంద్రశేఖర్, అనూప మాట్లాడుతూ.. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (CFI) జనరల్ సెక్రటరీ మణిందర్ సింగ్ అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాల్‌రైడ్ పార్క్‌లో హంజా ఖాన్ వద్ద, అమెరికాలో కానర్ ఫీల్డ్స్ వద్ద శిక్షణ పొందుతున్న అగస్తీ.. 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్‌లో భారత్ కు స్వర్ణ పతకాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

అగస్తీ హై-పెర్ఫార్మెన్స్ టీమ్:

  • ప్రధాన కోచ్: కానర్ ఫీల్డ్స్ (ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, USA)
  • స్థానిక కోచ్‌లు: హంజా ఖాన్, కమలేష్ తిగుళ్ల (హైదరాబాద్)
  • నిపుణులు: డా. షిఫ్రా ఫెర్నాండెజ్ (ఫిజియో), అరుణ ప్రసాద్ (న్యూట్రిషన్), జూలీ అయ్యర్ (సైకాలజిస్ట్)