Sat. Jan 4th, 2025

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జనవరి 1,2025: సుడాన్‌ దేశానికి చెందిన ఒక పసికందుకు హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత విషమ స్థితిలో ఉన్న బిడ్డకు చికిత్స అందించి, రోగాన్ని పూర్తిగా నయం చేశారు. సుమారు నెల రోజులపాటు ఈ చిన్నారికి నీలోఫర్ హాస్పిటల్‌లో ఉచితంగా వైద్యం అందించారు.

ఐవీఎఫ్ ద్వారా బిడ్డను పొందేందుకు సుడాన్‌ దంపతులు ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. స్థానిక కార్పొరేట్ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ చేసిన అనంతరం, ఆ మహిళకు మగ బిడ్డ జన్మించాడు. పుట్టిన వెంటనే బాబుకు బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, లంగ్స్ సంబంధిత సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో, 6 రోజుల పాటు ఐసీయూలో ఉంచి నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు చికిత్స అందించారు. సుడాన్‌ దంపతుల వద్ద డబ్బులు అయిపోవడంతో, బాబును నీలోఫర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అప్పుడు, నీలోఫర్ హాస్పిటల్ డాక్టర్లు, ఆ శిశువుకు ఉచితంగా చికిత్స అందించి పూర్తిగా కోలుకునేలా చేశారు.

బాబు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్ అవడంతో, సుడాన్‌ మహిళ (43 ఏళ్ల) డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ, “మేము ఐవీఎఫ్ ద్వారా పిల్లలను పొందడానికి హైదరాబాద్‌కు వచ్చాం. కానీ, డెలివరీ తరువాత బాబు పరిస్థితి విషమించడంతో, నీలోఫర్ డాక్టర్లు మా బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు” అని పేర్కొన్నారు.

తీవ్ర అనారోగ్యంతో ఉన్న బాబుకు చికిత్స అందించిన డాక్టర్ల బృందాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్ ,హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్‌.వి. కర్ణన్ అభినందించారు.

error: Content is protected !!