365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 25,2025: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న విలువైన భూమిని హైడ్రా అధికారులు ఆక్రమణల నుంచి విముక్తి చేశారు. దాదాపు 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుంది.
రెండు దశాబ్దాలుగా అక్రమార్కుల కబ్జాలో ఉన్న ఈ స్థలాన్ని సోమవారం ఉదయం హైడ్రా స్వాధీనం చేసుకుంది.
ఈ భూమి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్‌లో ప్రజావసరాల కోసం కేటాయించబడింది. అయితే, పిల్లా సత్యనారాయణ అనే వ్యక్తి దానిని ఆక్రమించి, నకిలీ హౌస్ నంబర్ సృష్టించి అక్కడ నర్సరీ నడుపుతున్నాడు. ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, జీహెచ్ఎంసీ అనేకసార్లు చర్యలు తీసుకునే ప్రయత్నం చేసింది.

సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ, ఆ ఆదేశాల ప్రకారం అక్కడ ఎలాంటి నిర్మాణాలు, వాణిజ్య కార్యక్రమాలు నిషేధం. అయినప్పటికీ అతను షెడ్లు నిర్మించి నర్సరీ నడిపాడు.
హైడ్రా విచారణ – కోర్టు అనుమతి
జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఈ అవకతవకలపై హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టారు. భూమి ప్రజావసరాల కోసం కేటాయించబడినదని తేల్చి, సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు.
ఇది కూడా చదవండి…పవన్ కళ్యాణ్ ‘ఓజీ ‘ నుంచి మరో సాంగ్..! ‘సువ్వి సువ్వి’ ఆగస్టు 27 తేదీన విడుదల..
సత్యనారాయణ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఈసారి అతనికి వెనకడుగు పడింది. గతంలో పొందిన స్టేటస్‌కోను కోర్టు రద్దు చేసి, హైడ్రా చర్యలకు అనుమతి ఇచ్చింది.
కూల్చివేతలు – భూమికి విముక్తి
కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయం హైడ్రా అధికారులు నర్సరీలో ఉన్న మొక్కలను తరలించుకునేందుకు అవకాశం ఇచ్చి, అనంతరం షెడ్లను కూల్చివేసి ఆక్రమణలను తొలగించారు. తర్వాత అక్కడ “హైడ్రా రక్షించిన భూమి” అని బోర్డులు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాద్, పాలకమండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ దీర్ఘకాల న్యాయపోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణల నుంచి విడిపించినందుకు తెలంగాణ ప్రభుత్వం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్, జీహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.