365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఫిబ్రవరి 4,2025: హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టి, వ్యర్థ పదార్థాలు పోస్తున్న వారిపై హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు నిఘాను కట్టుదిట్టం చేశాయి. సోమవారం అర్ధరాత్రి బండ్లగూడ, పేట్ బషీరాబాద్ ప్రాంతాల్లో అక్రమంగా మట్టి పోస్తున్న లారీలను గుర్తించి పట్టుకున్నాయి.
బండ్లగూడలో అర్ధరాత్రి ఆకస్మిక దాడి
బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉందాసాగర్ చెరువులో మట్టి పోస్తున్న నాలుగు టిప్పర్లను హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందాలు అర్ధరాత్రి పట్టుకున్నాయి. చెరువులో మట్టిని సమతలంగా చేయడానికి ఉపయోగించిన జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లారీలు, జేసీబీని బండ్లగూడ పోలీసులకు అప్పగించి, బాధ్యులపై కేసులు నమోదు చేశారు.

పేట్ బషీరాబాద్‌లో టిప్పర్ లారీ స్వాధీనం
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవులపల్లి సమర్ కుంట చెరువులో మట్టి పోస్తున్న టిప్పర్ లారీని హైడ్రా బృందాలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టారు.
అక్రమ మట్టిపోసేవారిపై కఠిన చర్యలు
చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టిని లేదా గృహ నిర్మాణ వ్యర్థాలను పడేస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు. అక్రమ కట్టడాలను అడ్డుకోవడానికి ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
చెరువుల పరిరక్షణకు సహకరించండి. అక్రమ నిర్మాణాలపై సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయండి.