365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్, హైదరాబాద్, ఫిబ్రవరి 7,2025: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో లే ఔట్ల భూకబ్జాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. లే ఔట్ల సరిహద్దులను తేల్చేందుకు త్వరలోనే హైడ్రా సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమగ్ర సర్వేకు ప్రణాళిక
సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే విభాగం, రెవెన్యూ, హైడ్రా సర్వే బృందాల సమక్షంలో పారదర్శకంగా ఈ సర్వే చేపట్టి లే ఔట్ల హద్దులను తేలుస్తామని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. లే ఔట్లలోని పార్కులు, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలను కబ్జా కాకుండా కాపాడతామని తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా క్షేత్రస్థాయి విచారణ
అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఐలాపూర్, చక్రపురి కాలనీ, ఆర్టీసీ కాలనీ, వెంకటరమణ కాలనీల్లో పరిశీలన చేసి, స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2025/02/HYDRA-1.jpg)
ప్రజల ఆవేదన
హైడ్రా కమిషనర్ పర్యటన వార్త తెలియగానే బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ గోడును వినిపించారు. ఐలాపూర్ రాజగోపాల నగర్ అసోసియేషన్ ప్రతినిధులు 40 ఏళ్లుగా తమ ప్లాట్లు కబ్జాలో ఉన్నాయని, కనీసం వాటిని సందర్శించే వీలుకూడా లేకుండా పోయిందని వాపోయారు.
కోర్టు తీర్పు ముందు ప్లాట్ల విక్రయాలు
1980లలో 5,000 మందికిపైగా ఈ ప్రాంతంలో ప్లాట్లు కొన్నారు. అయితే, అప్పుడు ఈ భూమి ప్రభుత్వానికి చెందినదని అధికారులు ప్రకటించగా, బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు వెలువడేలోపే ముఖీం అనే వ్యక్తి ఈ ప్లాట్లను వేరే వారి పేరుతో అమ్ముతున్నాడని రాజగోపాల నగర్ ప్రతినిధులు ఆరోపించారు.
అధికారులపై ఆరోపణలు
ప్రాంతంలో చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి వర్గాలకు చెందినవారని, అయినా తమ సమస్యపై స్థానిక అధికారులు స్పందించకపోవడం బాధకరమని పలువురు వాపోయారు. తమను బెదిరిస్తున్నారని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
![](http://365telugu.com/wp-content/uploads/2025/02/HYDRA-1.jpg)
ఇద్దరు కబ్జాదారులపై తీవ్ర ఆరోపణలు
అమీన్‌పూర్ మున్సిపాలిటీ చక్రపురి, ఆర్టీసీ, వెంకటరమణ కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గోల్డెన్ కీ వెంచర్స్ వారు లే ఔట్లలోని పార్కులు, రహదారులను కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు.
హైడ్రా స్పష్టీకరణ
అమీన్‌పూర్ ఐలాపూర్ గ్రామంలో భూకబ్జా కేసులపై కోర్టు ఉత్తర్వులను పరిశీలించి తుది లబ్ధిదారులను తేలుస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఇకపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైడ్రా ముఖ్య లక్ష్యం
ప్రభుత్వ, ప్రజావసరాల కోసం కేటాయించిన భూములను కాపాడాలన్న ఉద్దేశంతో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేశామని హైడ్రా అధికారులు తెలిపారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తుక్కుగూడ చెరువుల పరిశీలన
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో సురోని చెరువు, కొత్తకుంట, పావని చెరువుల భూకబ్జా సమస్యలను కూడా పరిశీలించారు.
హైడ్రా సమగ్ర సర్వే అనంతరం అన్ని వివాదాలకు ముగింపు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు.”