365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబరు 20,2026: ఒకప్పుడు కబ్జాల కోరల్లో చిక్కి, ఆనవాళ్లు కోల్పోయిన పాతబస్తీలోని చారిత్రక ‘బమ్-రుక్న్-ఉద్-దౌలా’ చెరువుకు హైడ్రా (HYDRAA) ప్రాణం పోసింది. నిజాంల కాలం నాటి ఈ అపురూప కట్టడాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, జనవరిలో ప్రారంభానికి సిద్ధం చేస్తోంది. శనివారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు.
విహార కేంద్రంగా చారిత్రక క్షేత్రం
కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో ఈ చెరువును ఒక అద్భుతమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
వాకింగ్ ట్రాక్ & ఓపెన్ జిమ్: చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్ ట్రాక్‌లు, వృద్ధులు విశ్రాంతి తీసుకోవడానికి గజబోలు (Gazebos), యువత కోసం ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
చిన్నారుల కోసం: చెరువుకు ఇరువైపులా పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియాలను అభివృద్ధి చేస్తున్నారు.

హరిత వాతావరణం: ఔషధ గుణాలున్న మొక్కలు, సుగంధ పరిమళాలు వెదజల్లే పూల మొక్కలతో చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపనున్నారు.
వరద కష్టాలకు చెక్!
రాజేంద్రనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీరు చెరువులోకి సజావుగా చేరేలా ఇన్-లెట్లను నిర్మించారు. సుమారు 10 కిలోమీటర్ల మేర వచ్చే వరద నీటిని ఈ చెరువు ఒడిసిపట్టుకోవడం వల్ల స్థానిక ప్రాంతాల్లో వరద ముప్పు తప్పుతుందని కమిషనర్ పేర్కొన్నారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
చరిత్ర పుటల నుంచి..
1970లో మూడవ నిజాం సికందర్ జా పాలనలో అప్పటి ప్రధాని నవాబ్ రుక్న్-ఉద్-దౌలా ఈ చెరువును నిర్మించారు.
ఒకప్పుడు 104 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు, ఆక్రమణల వల్ల క్రమంగా తగ్గిపోయింది.
హెచ్‌ఎండీఏ రికార్డుల ప్రకారం 17.05 ఎకరాలు ఉండగా, హైడ్రా రంగంలోకి దిగే సమయానికి కేవలం 4.12 ఎకరాలు మాత్రమే మిగిలింది.

గత ఆగస్టులో అనేక విమర్శలు, అవరోధాల మధ్య హైడ్రా ఆక్రమణలను తొలగించి, హెచ్‌ఎండీఏ నిర్దేశించిన పూర్తి భూమిని స్వాధీనం చేసుకుంది.
ఔషధ గుణాల నీరు – నిజాంల అనుబంధం
ఈ చెరువుపై ఎన్నో ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. పూర్వం మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమ్-రుక్న్-ఉద్-దౌలాను రాణులు స్నానాలకు ఉపయోగించేవారని స్థానికులు చెబుతుంటారు. ఈ చెరువు నీటిలో ఔషధ గుణాలు ఉండేవని, ఇక్కడి నీటిని నిజాం పాలకులు తాగడానికి వాడేవారని సమాచారం. అంతేకాదు, పూల పరిమళంతో కూడిన ఇక్కడి నీటిని సెంటు (Scent) తయారీ కోసం అరబ్ దేశాలకు కూడా తరలించేవారట.
అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ చెరువును హైడ్రా మళ్లీ పునరుద్ధరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనవరిలో ఈ సుందరమైన చెరువు నగరవాసులకు అందుబాటులోకి రానుంది.
