365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 11,2025: రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో శనివారం రెండు పార్కులను హైడ్రా (హైదరాబాద్ రివర్న్యూ డెవలప్‌మెంట్ అథారిటీ) రక్షించింది. పద్మశ్రీ హిల్స్ కాలనీలోని 2600 గజాల పార్కు స్థలాన్ని మొదట కాపాడింది.

1983లో 10 ఎకరాల విస్తీర్ణంలో 230 ప్లాట్లతో లేఅవుట్ వేయగా, ఇందులో 2600 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. మున్సిపాలిటీ అధికారులు ఈ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి, అభివృద్ధి చేయాలని ప్రయత్నించగా, పక్కనే భూమి ఉన్నవారు ‘ఇది మా స్థలం’ అంటూ అడ్డుకుని పనులు ఆగిపోయాయి.

పద్మశ్రీనగర్ కాలనీ నివాసులు హైడ్రాకు ఫిర్యాదు చేస్తే, స్థానికంగా రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, పార్కుకు కేటాయించిన స్థలమేనని హైడ్రా నిర్ధారించుకుంది. శనివారం పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, హైడ్రా బోర్డులు వేసింది.

అంతేకాకుండా, ఈ కాలనీకి ఆనుకున్న పీఎన్‌టీ కాలనీలోని డి బ్లాక్‌లో మరో 1112 గజాల పార్కు స్థలాన్ని కబ్జాల చెర నుంచి విముక్తి చేసింది. ఇలా మొత్తం 3712 గజాల పార్కు స్థలాలను కాపాడి, చుట్టూ ఫెన్సింగ్ వేసింది. గతంలో కూడా పీ అండ్ టీ కాలనీలోని సి, బి బ్లాకుల్లో 4400 గజాల పార్కు స్థలాలను హైడ్రా రక్షించిన విషయం తెలిసిందే.

ఈ చర్యలతో కాలనీ నివాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా ఇలాంటి పబ్లిక్ స్పేస్‌లను కాపాడటం ద్వారా గ్రీన్ కవర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.