365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 31,2025: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీలోని చౌదరిగూడ డాక్టర్స్ కాలనీలో 4,000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా విజయవంతంగా కాపాడింది. ఈ భూమి మార్కెట్ విలువ రూ.30 కోట్లకు పైమాటే.
1985లో 26.9 ఎకరాల్లో 500 ప్లాట్లతో లేఔట్ ఏర్పాటు చేసిన భూ యజమానులే ఈ ఆక్రమణలకు పాల్పడడం ఆసక్తికరం.
లేఔట్‌లో పార్కుగా కేటాయించిన 4 వేల గజాలను ఆముదాల నరసింహ కుమారుడు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్లతో 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా మార్చి కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేశాడు.
కులకర్ణి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా విభజించి రాజేష్, సోమాని సహా పలువురికి విక్రయించాడు.

డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మున్సిపాలిటీ అధికారులకు, హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కానీ ఈ సమస్యను గత సెప్టెంబరులో హైడ్రా ప్రజావాణికి తీసుకెళ్లారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. విచారణ అనంతరం పార్కు స్థలంగా నిర్ధారించి, శుక్రవారం ఆక్రమణలను పూర్తిగా తొలగించారు.
4 వేల గజాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా బోర్డులు పెట్టారు.ఈ చర్యతో పార్కు కబ్జాకు తెరపడగా, కాలనీ నివాసులు ఊపిరి పీల్చుకున్నారు. హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
