365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 3, 2022:”నేను ఓడిపోయినట్లుగా భావించలేదు.. నేను నా జీవితంలో ఆరేడేళ్ల పాటు అపజయా లనే చవిచూశాను” అని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ సి.ఎ. స్టూడెంట్స్ నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేనాని పావనకల్యాణ్ హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..”నేను నా జీవితంలో ఆరేడేళ్లపాటు అపజయాలనే చవిచూశాను”ఆ తర్వాతే “గబ్బర్ సింగ్” సినిమా విజయం దక్కింది. దీంతోపాటు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే..మీకు వచ్చిన విజయం వెనక వేల మంది కృషి ఉంటుందని మరువద్దు.
వారికి మీ ధన్యవాదాలు తెలపడం మరిచిపోకూడదు. అది తల్లిదండ్రులు కావచ్చు మరెవ్వరైనా కావచ్చు. ఇది ఒక విజయం సాధించాలి అనుకొనే ప్రతీ వ్యక్తికీ అవసరం. అపజయాలను, విజయాలను సమానంగా స్వీకరించాలి. నేను రాజకీయంగా అపజయం పొందిన వ్యక్తిగానే భావిస్తాను.
కానీ.. ఎప్పటికీ నేను ఓడిపోయినట్టుగా భావించలేదని ఆయన అన్నారు.ఒక అపజయం కూడా సగం విజయం అనే భావన నింపుకున్నాను. నేను కనీసం ప్రయత్నం చేశానని అనుకొంటాను.
మీ అందరికీ నా విన్నపం ఒక్కటే… అపజయం ఎదురైనా ఎన్నడూ చింతించవద్దు… అలానే ఏ దశలోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు” అని పవన్ కళ్యాణ్ విద్యార్థులకు దిశానిర్థేశం చేశారు.
రాజకీయాలు నా దేశం కోసం.. నేను ఎంత వరకూ విజయం సాధించానో నాకు తెలియదు. కానీ సినిమాల్లో నటించడం నేను జీవించేందుకు.. కానీ రాజకీయాలు మాత్రం నా దేశానికి… నా జాతి కోసమే.
చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అని. విజయం కోసం ఎదురు చూసే వ్యక్తులు తప్పనిసరిగా కామ, క్రోధ, మధ,మాత్సర్యాలను అధిగమించాలని ఆయన తెలిపారు.
ఇక రెండోది… మహాత్మా గాంధీ మొదలు అందరూ అచరించిన విధంగా… పని చేయకుండా వచ్చే సంపద, మనస్సాక్షి లేని సంతోషం, వ్యక్తిత్వం లేని జ్ఞానం, నీతి లేని వాణిజ్యం, మానవత్వం లేని శాస్త్రం, త్యాగం ఎరుగని భక్తి ఎన్నటికీ విజయతీరాలకు చేర్చలేవు.
కాబట్టి, ఇవే నా ప్రాధమిక ఆలోచనా సరళి, జీవన విధానం. వీటిని సాధించటం అంత తేలిక కానప్పటికీ నేను దీన్ని సాధించేందుకు కృషి చేస్తూనే ఉంటా. సినిమా ఎప్పుడూ నేను కోరుకొంది కాదని జనసేన పార్టీ చీఫ్ అన్నారు.
“నా ఆలోచనలు, ఆశయాలు వేరే రీతిన ఉంటాయి. సీఏ విధ్యార్థులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ జీవితంలో విజయాలు సాధించాలి. మీ వ్యక్తిగత విజయాలు జాతికి సంపదగా భావించండి. నా మొదటి సినియా అపజయం తర్వాత నేనెప్పుడూ నిరుత్సాహపడలేదు.
కానీ నా విజయాల గ్రాఫ్ ఏడవ సినిమా తర్వాతే పెరిగింది”.”మీరు దాదాపు 1.5 బిలియన్ల ప్రజలతో పోటీపడాల్సి ఉంది కాబట్టి మీ ముందుకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో విజయశిఖరాలను అధిరోహించాలి.
మీరు కలగన్న అవకాశమే రావాలని ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాల ను అందిపుచ్చుకొని పురోగమించాల్సి ఉంటుంది. అపజయాలు, విజయాలు సర్వసాధారణం”.
“కఠిన, ప్రతికూల పరిస్థితులే మిమ్మల్ని మరింత రాటుతేలేలా చేస్తాయని మరువవద్దు. ఈ పరిస్థితులే మీకు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిమ్మలని తయారు చేస్తాయని “పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.