Wed. Oct 16th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,అక్టోబర్ 2,2024: ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 21 రకాల వైకల్యాల్లో ఆటిజం ఒకటి. ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, ముందుగా రోగనిర్ధారణ చేసి, అవసరమైన చికిత్సలను అందించినట్లయితే, వారి న్యూరోటైపికల్ తోటివారిలాగే జీవితాలను గడపవచ్చు. అయితే, సరైన సౌకర్యాలు లేకపోవడం, ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యలు లేని కారణంగా, చాలా మంది పిల్లలు సకాలంలో సరైన చికిత్సలు అందుకోలేక ఆటిజం సమస్య కు గురవుతున్నారు.

ఇది చిన్నారులు పెరిగే కొద్దీ గణనీయమైన వైఫల్యాలకు దారి తీస్తోంది. దీనివల్ల పిల్లలు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తోంది.

ప్రజారోగ్య సంరక్షణలో ఈ అంతరాన్ని సద్వినియోగం చేసుకుంటూ, నగరాలు,పట్టణాల్లో అక్రమ చికిత్సా కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అవసరమైన వనరులు, విద్యార్హతలు, ప్రభుత్వ లైసెన్సులు లేని ఈ కేంద్రాలు చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ,సీనియర్ సిటిజన్స్ (DDEW) మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం లేదు.

వారు ఆటిజం, ADHD, స్పీచ్ ఆలస్యం ,ఇతర నరాల సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలకు నాసిరకం,తప్పుదారి పట్టించే చికిత్సలను అందిస్తూ వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ కేంద్రాలు సహాయం చేయడానికి బదులు, మరింత హాని కలిగిస్తున్నాయని ఆయా చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“తమ పిల్లలకు సరైన వైద్యం అందించి వారి జీవితాలు బాగుపడతాయనే ఆశతో తాము ఈ కేంద్రాలకు వెళ్తున్నాం, కాని వాస్తవానికి, ఈ అక్రమ చికిత్సా కేంద్రాలు తమను మోసం చేస్తున్నాయని, ఆర్థికపరంగా కూడా తమని దోపిడీ చేస్తున్నాయని, అంతేకాదు తమ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

అనుమతులు లేని ఆటిజంథెరపీ సెంటర్లను వెంటనే మూసివేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు తమ ఆవేదన ను వ్యక్తం చేస్తున్నారు. “ఈ కేంద్రాలు తమ పిల్లల ఆరోగ్యాన్ని, తమకు మానసిక ప్రశాంతతలేకుండా ఆడుకుంటున్నాయని, ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమ కేంద్రాలను మూసివేసి, లైసెన్స్‌తో కూడిన సౌకర్యాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించాలని బాధితులు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతుండగా, ప్రభుత్వం జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకుని, దోపిడీకి గురికాకుండా తమని రక్షించాలని వారు వేడుకుంటున్నారు.

error: Content is protected !!