Thu. Dec 7th, 2023

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అక్టోబర్ 10,2023:దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. సోమవారం నాటి నష్టాలను పూడ్చాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధ భయాల నుంచి ఇన్వెస్టర్లు క్రమంగా బయటపడుతున్నారు.

ఆసియాలో చైనా మినహా అన్ని దేశాల మార్కెట్లూ పాజిటివ్‌గా క్లోజయ్యాయి. ఐరోపా, అమెరికా మార్కెట్లు పుంజుకున్నాయి. పండగల సీజన్‌ మొదలవ్వడం, కంపెనీల ఫలితాలు ఇతర ఆర్థిక పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు.

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 19,689 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది. స్థిరాస్తి రంగ షేర్లు జోరు ప్రదర్శించాయి.

క్రితం సెషన్లో 65,512 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,662 వద్ద మొదలైంది. 65,662 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,180 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

చివరికి 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిసింది. సోమవారం 19,512 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,565 వద్ద ఓపెనైంది. 19,565 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది.

19,717 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 177 పాయింట్లు పెరిగి 19,689 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 473 పాయింట్లు ఎగిసి 44,360 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50లో 44 కంపెనీలు లాభపడగా 5 నష్టపోయాయి. కోల్‌ ఇండియా (5.07%), అదానీ పోర్ట్స్‌ (3.54%), భారతీ ఎయిర్‌టెల్‌ (2.54%), కొటక్‌ బ్యాంక్‌ (2.34%), హిందాల్కో (2.38%) టాప్‌ గెయినర్స్‌.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ (0.70%), సిప్లా (0.50%), టీసీఎస్‌ (0.24%), డాక్టర్‌ రెడ్డీస్‌ (0.16%), టైటాన్‌ (0.05%) టాప్‌ లాసర్స్‌. హెల్త్‌కేర్‌ మినహా బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎగిశాయి.

స్థిరాస్తి సూచీ ఏకంగా 4 శాతానికి పైగా లాభపడింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, లోహాల సూచీలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. నిఫ్టీ అక్టోబర్స్‌ ఫ్యూచర్స్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,760 వద్ద రెసిస్టెన్సీ, 19,650 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి.

ఇన్వెస్టర్లు క్రిసిల్‌, కోల్‌ ఇండియా, యూపీఎల్‌, ఎస్కార్ట్స్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లను స్వల్ప కాలానికి కొనుగోలు చేయొచ్చు. నిఫ్టీ పెరగడంలో ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎయిర్‌టెల్‌, కొటక్‌ ఎక్కువగా కంట్రిబ్యూట్‌ చేశాయి.

బయ్‌బ్యాక్‌ వార్తలు వచ్చినప్పటికీ టీసీఎస్‌ కౌంటర్లో సందడి కనిపించలేదు. రెండో త్రైమాసికంలో విక్రయాల విలువ 52 శాతం పెరగడంతో అజ్మీరా రియాల్టీ షేర్లు 18 శాతం లాభపడ్డాయి. క్యూ2 లాభం తగ్గడంతో జీఎం బ్రూవరీస్‌ షేర్లు ఇంట్రాడేలో 9 శాతం మేర పతనమయ్యాయి.

ఏంజెల్‌ వన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఈ, బిర్లాసాప్ట్‌, గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌, కల్యాణ్‌ జువెలర్స్‌, పేటీఎం, ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌, జొమాటో షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి.

జీఎండీసీ షేర్లు 15 శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ భారత FY24 జీడీపీ వృద్ధిని 20 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.3 శాతంగా అంచనా వేసింది. FY25నీ యథాతథంగా ఉంచింది. ఇది ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709