Thu. Dec 12th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,11thనవంబర్,2024,హైదరాబాద్: ఆధునిక కాలంలో విద్యార్థులు, యువతలు గురువుల ప్రాధాన్యతను గుర్తించాలనే ఆవశ్యకత ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలో పునాది నిర్మించిన గురువులను జీవితాంతం గుర్తుంచుకోవాలని, ఆ స్ఫూర్తిని నెమరువేయాలని సూచించారు.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హిందూ సేవా ఆధ్యాత్మిక ఫెయిర్ కోలాహలంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఆచార్య వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. ఇంపాక్ట్ సొసైటీ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు, ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ తరం విద్యార్థులు, యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలుసుకునేందుకు ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి రోజూ ఒక అంశంపై వందనం కార్యక్రమం నిర్వహించడం ద్వారా ఆ అంశం పట్ల అభిరుచి, గౌరవం పెరిగేలా చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు.

మధ్యాహ్నం సంఘ్ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ ఆధ్వర్యంలో పాఠశాలల నిర్వాహకుల సమ్మేళనం జరిగింది. ఇందులో ఉపాధ్యాయ శ్రేష్టులు ఎస్. ఎన్. రెడ్డి, ఎస్. వి. ఎస్. లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇక్కడ వివిధ సేవా క్షేత్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వారాంతం కావడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి, స్టాల్స్ వద్ద ఆగి వివరాలు తెలుసుకున్నారు.

సాయంత్రం ఆత్మీయ వాతావరణంలో గురువందనం నిర్వహించారు. డీపీఎస్ పాఠశాల చైర్మన్ శ్రీ అజయ్ గుప్తా అధ్యక్షత వహించారు. అతిథులుగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధ్యక్షులు ఎన్. కేశవ్ రెడ్డి, బచ్ పన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ కే. శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధమాయానంద స్వామి విచ్చేశారు.

సాయంత్రం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

error: Content is protected !!