365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి13, 2023: తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కూరగాయలు అమ్మే వ్యక్తి ఖాతాలో కోట్ల రూపాయలు ఉన్నాయని, అతను అందుకు సంబంధిత పన్ను చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖా నోటీసులు పంపింది. దీంతో సదరు బాధితుడు లబోదిబోమని మొత్తుకుంటున్నాడు.
కూరగాయల విక్రేత ఖాతాలో 172 కోట్ల రూపాయలు జమ అయ్యాయని, ఆ వ్యక్తి ఖాతాలో జమ అయిన కోట్లాది రూపాయల పన్ను కట్టలేదని నోటీసులో రాసి ఉంది.
ఈ కూరగాయల వ్యాపారి ఖాతాలో రూ.172 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కూరగాయల అమ్మకందారుడు ఇంకేదో చెబుతున్నాడు. దీంతో బాధితుడు తనకేమీ తెలియదంటూ సహాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. అసలు విషయం ఏమిటంటే..?
నెల రోజుల క్రితం ఐటీ బృందానికి ఆదాయం కంటే ఎక్కువ నగదు బదిలీ జరిగిన వివరాల జాబితా లభించింది. ఈ నివేదిక ప్రకారం, ఈ కేసు ఘాజీపూర్‌లోని గహ్మర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి సంబంధించినది.
ఇక్కడ రాయపట్టి ప్రాంతానికి చెందిన వినోద్ రస్తోగి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఒకరోజు వినోద్‌కు అకస్మాత్తుగా ఇన్‌కమ్ ట్యాక్స్ పంపిన నోటీసు అందిందని, ఆ తర్వాత అతని పేరు మీద ఖాతాలో రూ.172 కోట్ల 81 లక్షల 59 వేలు జమ అయినట్లు వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ డబ్బు తనది కాదని వినోద్ చెబుతున్నాడు. వినోద్ పోలీసులకు పిర్యాదు చేశాడు. తన ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగం చేసి ఎవరో ఈ ఖాతాను తెరిచారని వినోద్ పోలీస్ స్టేషన్‌లో తెలిపాడు. చెక్కుల ద్వారా ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయినట్లు సమాచారం.
ఈ మొత్తానికి పన్ను చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు పంపినప్పుడు ఈ విషయం తెలిసిందని, తన పత్రాలతో ఎవరో ఖాతా తెరిచారని, దీంతో తనకు సంబంధం లేదని బాధితుడు వాపోయాడు. ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ఈ కేసును సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు.