365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 5,2022: మహిళకు సహజంగానే బయోలాజికల్ రెస్పాన్సిబులిటీస్ ఉంటాయి. దానివల్ల కొన్ని సందర్భాలలో సమాజంలో అసమానతలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అసమానతలు అనేవి ప్రపంచంలో ప్రతి ఒక్కరితో కాకపోయినా, ప్రతిచోటా మహిళ ఎదుర్కొంటోంది.
ఎలా అంటే మన సమాజంలో చిన్నపిల్లలను కొట్టడం, తిట్టడం, మన మీద ఆధారపడిన వాళ్లను చిన్న చూపు చూడటం, ఎంత సహజంగా ఫీల్ అవుతారో, అలాగే మహిళను హింసించటం, అవమానించటం ఒక హక్కుగా సహజ లక్షణంగా ఫీల్ అవుతారు.
మహిళ ను డామినేట్ చేయడానికి, శారీరకంగా హింసించడానికి, మానసికంగా అవమానించడానికి, సామాజికంగా తక్కువగా చూడటానికి, ఆమెను ఒక బానిసలా, సొంత వస్తువులా ఫీల్ అవ్వడానికి,పెత్తనం చేయడానికి ఉపయోగించే ఆయుధాలు, కొన్ని చోట్ల సాంప్రదాయాల పేరుతోనూ, మరికొన్ని చోట్ల శారీరక భద్రత పేరుతోనూ, కొన్నిచోట్ల వేరే దారి, ఆధారం, అవకాశం లేని సమయంలో బలంతోను సహజంగానే మహిళను హింసించడానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారు.
ముఖ్యంగా కరోనామహమ్మారీ సమయంలో లాక్ డౌన్ విధించడంతో మహిళలపై గృహహింసకు సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా పెరిగాయి. ఈ విషయాన్ని జాతీయ మహిళా కమిషన్, మీడియా సర్వే రిపోర్ట్ ల ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఉండే కేసుల సంఖ్య కంటే కూడా ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరిగిన శారీరక మానసిక గృహ హింస చాలా ఎక్కువగా పెరిగింది. మూడు నాలుగు నెలలుగా కుటుంబ సభ్యులందరూ పూర్తిగా ఇంట్లోనే ఉండటం వలన మహిళపై పని భారం ఇంకా ఎక్కువ పెరిగింది.
విడ్డూరం ఏమిటంటే కరోనా వల్ల ప్రపంచ ప్రజలందరికీ పని భారం తగ్గితే ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం ఎప్పుడూ ఉండే పని కంటే మూడు రెట్లు ఎక్కువ పెరిగింది. ఇంట్లో స్కూల్స్, కాలేజీ లేని పిల్లలు తల్లి వాళ్ళకి పని చేసి పెట్టడం ఒక హక్కుగా ఫీలవుతుంటారు. భార్య ఉద్యోగం చేసే సంపాదించేది అయినా లేదా ఇంట్లోనే ఉండి ఇంటి పని చూసుకునే మహిళ అయినా భర్త ,కుటుంబ సభ్యులకు ఆమె అన్ని చేసి పెట్టాలి.
ఒకవేళ కుటుంబసభ్యులు ఏదైనా పని షేర్ చేసుకున్నా అది ఒక రోజు, రెండు రోజులు, ఒక వారం లేదా వీడియోలు తీసుకోవడానికి పదిమందికి చెప్పుకోవడానికి తప్ప తల్లి లేదా భార్య బానిసత్వపు పనిని అర్థం చేసుకునే కుటుంబసభ్యులు చాలా తక్కువ. ఒకవేళ నిజంగా అర్థం చేసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని గృహహింస కేసులు మనం ఈ రోజు చూడవలసిన అవసరం వచ్చేది కాదు.
రిపోర్ట్స్ ప్రకారం భారతదేశంలో 50శాతం , యూఎస్ఏ లో 20శాతం, సౌత్ ఆఫ్రికా 37శాతం,యూ కె 25శాతం, ఆస్ట్రేలియా 75శాతం, ఫ్రాన్స్ 33 శాతం, టర్కీ 39శాతం కేసులు పెరిగాయి. అలాగే గృహహింస నుంచి రక్షించుకోవడానికి మహిళలు నెట్ ద్వారా మహిళా సహాయ కేంద్రాలను ఎన్జీవోస్ ను సంబంధిత ప్రొటెక్షన్ ఆఫీసులను ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది.