Tue. Dec 3rd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు11,2023: ఆధునిక సమాజంలోనూ మూఢ విశ్వాసాలతో, అనేక కారణాలతో మహిళలు మూడు పదుల వయసులోనే వితంతువులుగా, ఒంటరి మహిళలుగా మారుతున్నారు, సమాజంలో అవమానాలకు, అవహేళనలకు గురవుతూ నరకం అనుభవిస్తున్నారని ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ హెవెన్ హోమ్స్ సొసైటీ ఎన్.జి.ఓ జీ వరలక్ష్మీ తెలిపారు.

వివాహేతర సంబంధాలు , వివాహం తర్వాత కుటుంబంలోని ఆంక్షలు భరించలేక, భర్త ఆదరణ పొందలేక, వేధింపులు తాళలేక మహిళలు వివాహబంధం నుంచి బయటపడాల్సి వస్తోంది. అమ్మాయికి తక్కువ వయసు, అబ్బాయికి ఎక్కువ వయసు ఉండాలనే ఆచారం వల్ల భార్యల కంటే ముందే భర్తలు తనువు చాలించడండంతో వితంతువులుగా మిగలాల్సి వస్తోందని ఆమె చెప్పారు.

ఫలితంగా భారతదేశంలో వితంతువులు, ఒంటరి మహిళలు దాదాపు 40 మిలియన్స్ ఉన్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కోవిడ్ తర్వాత విడాకులు, వితంతువుల సంఖ్య మరింత పెరిగినట్లు ఈ సర్వేలు పేర్కొంటున్నాయని వరలక్ష్మీ చెబుతున్నారు.

కాలం చెల్లిన ఆచార, సంప్రదాయాలు భారతీయ స్త్రీలను అనేక బాధలకు గురి చేస్తున్నాయి. మహిళల స్వతంత్రతను హరిస్తున్నాయి. స్వేచ్ఛా జీవనాన్ని అనుమానిస్తున్నాయి. ఫలితంగా ఇష్టం లేకున్నా ఇల్లాలుగా అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. ఫలితంగానే ప్రపంచంలోనే అత్యంత తక్కువ విడాకులు 1.1 శాతం మన దేశంలోనే ఉన్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 లెక్కలు చెబుతున్నాయని వరలక్ష్మీ తెలిపారు.

పెళ్లి అయిన తర్వాత భార్య పూర్తిగా భర్త చెప్పు చేతుల్లోనే ఉండాలి, కనీసం ఇంటి నుంచి బయట అడుగుపెట్టినా చెప్పాలి, పరపురుషులతో ఎవరితో మాట్లాడినా వారికి అక్రమ సంబంధం అంటకట్టాలి, ఆర్ధిక స్వాతంత్య్రం స్త్రీలకు ఉండకూడదు, భార్యకు నచ్చకపోయినా భర్తతో కాపురం చేయాలి, లైంగిక వేధింపులకు గురి చేసినా మౌనంగా భరించాలి వంటి అనేక సమస్యలు విడాకులకు కారణం అవుతున్నాయి.

68.8 శాతం విడాకులు పైన పేర్కొన్న కారణాల వల్లే అవుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే -5 చెప్పడం విశేషం. ఇందులో 46.4 శాతం విడాకులు సెక్సువల్ అబ్యూజ్ వల్ల జరుతున్నాయని పేర్కొంది. 26.9 శాతం మంది మహిళల తమ భర్తల ఆధిపత్యాన్ని భరించలేక విడాకులు పొందుతున్నట్లు తెలిపింది.

యాక్సిడెంట్లలో చనిపోవడం, అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడడం, కుటుంబంలోని బాధ్యతలు నెరవేర్చలేక ఇల్లు వదిలి పారిపోవడం, తాగుడుకు అలవాటై ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకోవడం, మత్తు పదార్థాలకు బానిసై బయటపడలేక క్షణికావేశంలో సూసైడ్ చేసుకోవడం,

వ్యసనాలకు లోనై అప్పులు పెరిగి, ఒత్తిడి భరించలేక తనవు చాలించుకోవడం, విలాసాలకోసం అర్రులు చాచడం, బొల్తాపడడం తద్వారా జీవితానికి ముగింపు పలకడం వంటి అనేక అంశాల వల్ల స్త్రీలు వితంతువులుగా, ఒంటరి మహిళలుగా మారుతున్నారు.

ఈ అంశాల్లో తప్పు మగాడివల్ల జరిగితే శిక్ష మాత్రం స్త్రీలకు పడుతోంది. వితంతువులుగా అనేక అవమానాలను ఇంటా, బయటా భరించాల్సి వస్తోంది. అంతటితో సరిపోక ఆ కుటుంబ బాధ్యతను కూడా మోయాల్సి వస్తోంది.

సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని అపశకునంగా భావించే ఈ దుష్టాచార సమాజంలో అవహేళనలు ఎదుర్కొంటూ, ఒంటరి మహిళగా చులకన అవుతూ బతుకుబండి నడపాల్సిన దుస్థితిని భారతీయ స్త్రీలు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పారు.

ప్రభుత్వం సతిసహగమనం వంటి చట్టాలు నిషేధించినా, మహిళల పట్ల హింసను అరికట్టేందుకు అనేక చట్టాలు రూపొందించినా సమాజంలో మహిళల పట్ల దృక్పథం మారకపోవడంతో చట్టాలు చట్టబండలవుతున్నాయి. మహిళలకు భర్త లేక, కుటుంబం అండగా నిలబడక, సమాజంలో గౌరవం పొందక బతుకును ఈడ్చాల్సి వస్తోంది

కాబట్టి వితంతువులు, ఒంటరి మహిళలుగా ఉండడం వారు మాత్రమే చేసిన నేరం కాదన్న సత్యాన్ని గమనించి, నిందలు, శిక్షలు ఒక్క మహిళమీదనే వేయకుండా సమాజం సరిగ్గా అర్థం చేసుకున్న రోజు నిజంగా యత్ర నార్యస్తు పూజ్యంతే – రమంతే తత్ర దేవతాs: అన్నది ఆచరణలో అమలవుతుంది. మహిళల వికాసమే సమాజ అభ్యున్నతి అన్నది నిజం అవుతుంది” అని జీ వరలక్ష్మి వెల్లడించారు.

error: Content is protected !!