Sun. Nov 24th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం మిశ్రమంగా కదలాడాయి. ఉదయం నష్టాల్లోకి జారుకున్న బెంచ్‌మార్క్ సెన్సెక్స్, నిఫ్టీ మధ్యాహ్నం రికవరీ బాట పట్టాయి.

ఇప్పటికే గరిష్ఠాలకు చేరడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపడుతున్నారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇప్పట్లో నెగెటివ్ వడ్డీరేట్లను సవరించబోమని చెప్పడంతో యెన్ భారీగా పడింది.

ఇది ఆసియా మార్కెట్లకు ప్రతికూల సంకేతాలు పంపించింది. ఐరోపా మార్కెట్లు, టెక్ షేర్లు పుంజుకున్నాకే ఇక్కడా కొనుగోళ్లు పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫార్మా, ప్రభుత్వ బ్యాంకు షేర్లు రికవరీకి దన్నుగా నిలిచాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 5 పైసలు తగ్గి 83.11 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 71,315 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 71,479 వద్ద మొదలైంది. మరికాసేపటికే 71,071 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత పుంజుకొని 71,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

మొత్తంగా 122 పాయింట్ల లాభంతో 71,437 వద్ద ముగిసింది. మంగళవారం 21,477 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,337 వద్ద కనిష్ఠ స్థాయికి చేరింది. 21,505 వద్ద గరిష్ఠాన్ని అందుకొంది.

చివరికి 34 పాయింట్లు పెరిగి 21,453 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ కేవలం 3 పాయింట్లు పెరిగి 47,870 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 25 కంపెనీలు లాభపడగా 25 నష్టపోయాయి. కోల్ ఇండియా, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, టాటా కన్జూమర్, సిప్లా అత్యధికంగా లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, విప్రో, అదానీ ఎంటర్ ప్రైజెస్, యూపీఎల్, టీసీఎస్ టాప్ లాసర్స్.

నేడు ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.

నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ సపోర్టు 21500, రెసిస్టెన్సీ 21620 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్ములో జైడస్ వెల్‌నెస్, మారికో, అవంతీ ఫీడ్స్, ఓరియెంట్ ఎలక్ట్రిక్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కొనుగోలు చేయొచ్చు.

పునరుత్పాదక ఇంధన రంగంలో సంఘ్వీ మూవర్స్‌కు రూ.166 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చింది. 2015 ఆగస్టు తర్వాత ఎన్టీపీసీ షేర్లు తొలిసారి రూ.366 స్థాయిని తాకాయి.

ఏఐ పవర్డ్ ఎంపాయీ ఎంగేజ్‌మెంట్ అప్లికేషన్ల తయారీ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ జతకడుతోంది. నోవార్టిస్ హెల్త్‌కేర్‌తో జేబీ కెమిక్స్ ఒప్పందం కుదుర్చుకోనుంది.

పీహెచ్ డయాగ్నస్టిక్స్‌లో విజయ డయాగ్నస్టిక్స్ 100 శాతం వాటా దక్కించుకోనుంది. సుమన్ హెగ్డేను జూబిలంట్ ఫుడ్‌వర్క్స్ ఎగ్జిక్యూటివ్ వీపీగా నియమించింది. రిలయన్స్ లైఫ్ సైన్సెస్ నుంచి హనీవెల్ ఆటోమేషన్ కాంట్రాక్టు దక్కించుకుంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!