365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 29, 2025: భారత వాణిజ్య ,పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) తెలంగాణ చాప్టర్, యుఎఈలోని షార్జా ప్రభుత్వ షార్జా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్రీ జోన్ (సైఫ్ జోన్) సహకారంతో హైదరాబాద్‌లో కీలక వ్యాపార సదస్సును నిర్వహించింది.
“యుఎఈ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో మీ వ్యాపారాన్ని విస్తరించండి” అనే శీర్షికన జరిగిన ఈ సమావేశం, భారతీయ వ్యాపారాలకు ప్రపంచ విస్తరణ అవకాశాలను అన్వేషించేందుకు వేదికగా నిలిచింది.
ఈ సదస్సులో తయారీ, లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు, తెలంగాణ వ్యాప్తంగా విస్తృత శ్రేణి పరిశ్రమల నుండి ఔత్సాహికులు,హైదరాబాద్ నుండి 125కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొనడం విశేషం.

వ్యూహాత్మక భాగస్వామ్యంపై నొక్కిచెప్పిన ఫిక్కీ:
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ కో-చైర్మన్ & సుధాకర్ పివిసి ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జయదేవ్ మీలా స్వాగతోపన్యాసం చేశారు. భారతదేశం-యుఎఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సెపా) కింద, అంతర్జాతీయ మార్కెట్లను లక్ష్యంగా చేసుకున్న భారతీయ వ్యాపారాలకు యుఎఈ, ముఖ్యంగా షార్జా ఒక వ్యూహాత్మక లాంచ్‌ప్యాడ్‌గా ఎలా ఉపయోగపడుతుందో ఆయన వివరించారు.
సైఫ్ జోన్ ప్రయోజనాలను వివరించిన డైరెక్టర్ జనరల్..
సైఫ్ జోన్ డైరెక్టర్ జనరల్ సౌద్ అల్ మజ్రౌయి కీలకోపన్యాసం చేస్తూ, సైఫ్ జోన్ విశిష్ట ప్రయోజనాలను వెల్లడించారు. 100% విదేశీ యాజమాన్యం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సరళీకృత నియంత్రణ విధానాలు, సౌకర్యవంతమైన ప్రపంచ కనెక్టివిటీ వంటివి భారతీయ కంపెనీలు తమ ప్రపంచ కార్యకలాపాలను విస్తరించడానికి సైఫ్ జోన్‌ను ఒక ఆదర్శ కేంద్రంగా మారుస్తున్నాయని ఆయన తెలిపారు.
సైఫ్ జోన్ సౌకర్యాలపై ఒక కార్పొరేట్ వీడియో ప్రదర్శన అనంతరం,అనూప్ వారియర్ ప్రజెంటేషన్ ద్వారా షార్జాలో వ్యాపారం చేయడంలో ఉన్న సౌలభ్యం, భారతీయ పెట్టుబడిదారులకు లభించే మద్దతు గురించి వివరించారు.
సరిహద్దులకు మించిన అవకాశాల ప్రోత్సాహం..
ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు & ఎటర్నిఫై భాగస్వామి ధ్రువ్ గుప్తా ధన్యవాదాలతో సదస్సు ముగిసింది. భారతదేశం-యుఎఈ భాగస్వామ్యాల ప్రాముఖ్యతను పలు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ తరహా సదస్సులను నిర్వహించడంలో ఫిక్కీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
భారతీయ సంస్థలకు సరిహద్దు అవకాశాలను ప్రోత్సహించాలనే ఫిక్కీ విస్తృత వ్యూహంలో ఈ కార్యక్రమం ఒక భాగమని ఆయన తెలిపారు.