365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్15, 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. చైనా మార్కెట్లు నష్టపోయినా.. ఆసియా, అమెరికా, ఐరోపా నుంచి ప్రతికూల సంకేతాలు అందినా ఇన్వెస్టర్లు పట్టించుకోలేదు. పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉన్నారు.

క్రూడాయిల్‌ ధరల పెరుగుదల గురించీ ఆలోచించడం లేదు. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 319 పాయింట్లు పెరిగాయి. మిడ్‌క్యాప్‌ ర్యాలీకి కాస్త తెరపడింది. బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లకు ఐటీ, బ్యాంకింగ్‌ రంగాలు దన్నుగా నిలిచాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీయ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ అండగా ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలహీనపడి 83.18 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 67,519 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 67,659 వద్ద మొదలైంది. 67,614 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 319 పాయింట్ల లాభంతో 67,838 వద్ద ముగిసింది.

20,156 వద్ద ఓపెనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20,129 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,222 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొన్న సూచీ ఆఖరికి 89 పాయింట్లు పెరిగి 20,192 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 230 పాయింట్ల లాభంతో 46,231 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 32:18గా ఉంది. బజాజ్‌ ఆటో (6.29%), హీరోమోటో (2.25%), ఎం అండ్‌ ఎం (2.17%), గ్రాసిమ్‌ (1.99%), హెచ్‌సీఎల్‌ టెక్‌ (1.60%) టాప్‌ గెయినర్స్‌. బీపీసీఎల్‌ (1.60%), ఏసియన్‌ పెయింట్స్‌ (1.24%), హిందుస్థాన్‌ యునీలివర్‌ (1.27%), టాటా కన్జూమర్‌ (0.92%), బ్రిటానియా (0.97%) టాప్‌ లాసర్స్‌. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల్లో అమ్మకాల ప్రెజర్ కనిపించింది. ఐటీ, బ్యాంక్‌, ఆటో, ఫైనాన్స్‌, ఫార్మా రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపించింది.

నిఫ్టీ సెప్టెంబర్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 20,250 వద్ద రెసిస్టెన్స్‌, 20130 వద్ద సపోర్ట్‌ కనిపిస్తున్నాయి. ఇన్వెస్టర్లు ఐచర్‌ మోటార్స్‌, నెస్లే ఇండియా, ముత్తూట్‌ ఫైనాన్స్‌, సువెన్‌ ఫార్మా, బంధన్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ షేర్లను స్వల్ప కాలంలో కొనుగోలు చేయొచ్చు.

బ్రిడ్జి టు ఇండియా ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను క్రిసిల్‌ కొనుగోలు చేయబోతోంది. జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ రూపొందించిన ఆర్తో ఎవర్రా జనరిక్‌కు యూఎస్‌ ఎఫ్‌డీఏ అనుమతి లభించింది. మూడు వారాల మిడ్‌క్యాప్‌ ర్యాలీకి తెరపడింది. ఈ వారంలో నిఫ్టీ 50 కంపెనీల్లో 40 లాభపడ్డాయి.

పాజిటివ్‌ సెంటిమెంటుతో ఎం అండ్‌ ఎం, హీరో, టాటా మోటార్స్‌ షేర్లు పెరిగాయి. ముడి చమురు ధరల పెరుగుదలతో బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు నష్టపోయాయి. ధరలు తగ్గుతాయన్న సమాచారంతో టైర్‌ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.