365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూలై 11, 2025 : భారతదేశంలో జరగనున్న తదుపరి జనాభా లెక్కలు 2027లో సరికొత్త పద్ధతిలో నిర్వహించనున్నారు.
ఈసారి డిజిటల్ విధానంలో గణన జరగనుండగా, పౌరులు తమ వివరాలను స్వయంగా వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. కుల గణన కూడా ఈ ప్రక్రియలో భాగం కానుంది.
డిజిటల్ జనాభా గణన – రెండు దశలు:

జనాభా లెక్కల ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని అధికారులు సోమవారం (జూలై 7తేదీన, 2025) వెల్లడించారు. ఈ రెండు దశలకు అందుబాటులో ఉండేలా ఒక ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించ నున్నారు.
దీని ద్వారా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా, మొదటిసారిగా డిజిటల్ జనాభా లెక్కలలో భాగంగా ఎన్యూమరేటర్లు ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్‌లలోని మొబైల్ అప్లికేషన్‌ల ద్వారా పౌరుల డేటాను సేకరిస్తారు.
“డిజిటల్ జనాభా గణన అనేది జనాభా గణన ప్రక్రియను ఆధునీకరించే దిశగా ఒక కీలక అడుగు. మొదటిసారిగా, డేటాను సేకరించి సర్వర్‌కు ఎలక్ట్రానిక్‌గా పంపడానికి సాంకేతికత ఉపయోగపడుతుంది.
ఇది జనాభా గణన డేటాను త్వరగా అందుబాటులోకి తెస్తుంది” అని ఒక అధికారి తెలిపారు. డేటా సేకరణ, ప్రసారం, నిల్వ సమయంలో డేటా భద్రతను నిర్ధారించడానికి కఠినమైన భద్రతా చర్యలు అమలు చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఎప్పుడు జరుగుతుంది..?
మొదటి దశ (ఇంటి జాబితా దశ – HLO) 2026 ఏప్రిల్ 1న ప్రారంభ మవుతుంది. ఆ తర్వాత రెండవ దశ (జనాభా గణన – PE) 2027 ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఇందులో ఇంటి సభ్యుల కులాలను కూడా లెక్కించనున్నారు.
2027 జనాభా లెక్కల తేదీ మార్చి 1, 2027గా నిర్ణయించారు. అయితే లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కేంద్రపాలిత ప్రాంతాలకు 2026 అక్టోబర్ 1న జనాభా గణన జరుగుతుంది.