Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం తెరపడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బెంచ్ మార్క్ సూచీలు ఆద్యంతం రేంజు బౌండ్లో కదలాడాయి.

ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. నిఫ్టీ 36, సెన్సెక్స్ 132 పాయింట్ల మేర తగ్గాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు మాత్రం ఎగిశాయి.

విదేశీ సంస్థాగత మదుపర్లు నేడు రూ.1564 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్ వ్యాఖ్యల ప్రభావం మార్కెట్లపై కనిపించింది.

క్రితం సెషన్లో 69,653 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 69,694 వద్ద మొదలైంది. వెంటనే 69,320 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆపై పుంజుకొని 69,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది.

ఆఖరి వరకు రేంజుబౌండ్లోనే కొనసాగి 132 పాయింట్ల నష్టంతో 69,521 వద్ద ముగిసింది. గురువారం 20,932 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,950 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

20,941 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 36 పాయింట్లు పతనమై 20,901 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 6 పాయింట్లు ఎగిసి 46,841 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 27 కంపెనీలు లాభపడగా 23 నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, సిప్లా, ఎన్టీపీసీ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్ టెల్, హిందుస్థాన్ యునీలివర్, అపోలో హాస్పిటల్స్, ఓఎన్జీసీ, టాటా స్టీల్ టాప్ లాసర్స్.

నేడు ఎఫ్ఎంసీజీ, మెటల్ సూచీలు ఎక్కువ నష్టపోయాయి. ఆటో, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.

నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ రెసిస్టెన్సీ 21100, సపోర్టు 20920 వద్ద ఉన్నాయి. ఇన్వెస్టర్లు నియర్ టర్ములో ఇండస్ టవర్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్, లారస్ ల్యాబ్, వోల్టాస్, ఇండియా మార్ట్ షేర్ల కొనుగోలు పరిశీలించొచ్చు.

నేడు నిఫ్టీ సూచీ పతనంలో భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ, ఎల్ టీ, హెచ్‌యూఎల్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది.

టాటా పవర్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లకు చేరుకుంది. టాటా గ్రూపులో ఈ ఘనత సాధించిన ఆరో కంపెనీగా ఘనత సాధించింది. పీఎస్‌పీ ప్రాజెక్ట్స్ రూ.102 కోట్ల విలువైన నిర్మాణ ప్రాజెక్టు సంపాదించింది.

రిలయన్స్ ఇండస్ట్రీలో ఓ భారీ ట్రేడ్ జరిగింది. రూ.2,457 చొప్పున 27.5 లక్షల షేర్లు చేతులు మారాయి. ఇక టాటా పవర్లో రూ.322 చొప్పున 11.4 లక్షల షేర్లు చేతులు మారాయి.

నేడు బజాజ్ ఫిన్ సర్వ్, లార్సెన్ టర్బో, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఎస్బీఐ లైఫ్, టైటాన్ షేర్లు 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు జీవిత కాల గరిష్ఠాన్ని అందుకున్నాయి.

స్పైస్ జెట్ షేర్లు 19.99 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709
error: Content is protected !!