365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, డిసెంబర్ 13,2023: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్తబ్దుగా కదలాడాయి. స్వల్ప లాభాల్లో ముగిశాయి.
అమెరికా ఫెడ్ పాలసీ కమిటీ సమావేశం నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. లాభాలను స్వీకరించేందుకే మొగ్గు చూపారు.
అమెరికా ద్రవ్యోల్బణం పెరగడంతో ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించదన్న అంచనాలు మార్కెట్ వర్గాల్లో ఉన్నాయి. వీటికితోడుగా ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి.
దాంతో ఇంట్రాడేలో నష్టపోయిన సూచీలు ఆఖర్లో కోలుకున్నాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి రెండు పైసలు తగ్గి 83.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ పెరగడంలో ఎల్ టీ, ఎన్టీపీసీ కీలకంగా నిలిచాయి.
క్రితం సెషన్లో 69,551 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 69,648 వద్ద మొదలైంది. క్రమంగా బలహీనపడుతూ 69,100 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది.
ఆపై పుంజుకొని 69,657 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 33 పాయింట్ల లాభంతో 69,584 వద్ద ముగిసింది. బుధవారం 20,929 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,769 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరింది.
20,950 వద్ద గరిష్ఠాన్ని అందుకొని మొత్తంగా 19 పాయింట్లు పెరిగి 20,926 వద్ద క్లోజైంది. ఇక నిఫ్టీ బ్యాంకు 5 పాయింట్లు తగ్గి 47,092 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ50లో 31 కంపెనీలు లాభపడగా 19 నష్టపోయాయి. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, హీరోమోటో, పవర్ గ్రిడ్, ఐచర్ మోటార్స్ టాప్ గెయినర్స్‌గా అవతరించాయి.
టీసీఎస్, ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, యాక్సిస్ బ్యాంకు, అల్ట్రాటెక్ సెమ్ టాప్ లాసర్స్. నేడు ఐటీ రంగ సూచీ ఎక్కువగా నష్టపోయింది. ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్ రంగ సూచీలు కళకళలాడాయి.
నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఛార్ట్ గమనిస్తే 20,900 వద్ద సపోర్టు, 21,050 వద్ద రెసిస్టె్న్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప సమయానికి పవర్ గ్రిడ్, సిప్లా, ఎస్బీఐ, టాటా స్టీల్ షేర్ల కొనుగోలు పరిశీలించొచ్చు.
నిఫ్టీస్మాల్ క్యాప్100 సూచీ నేడు 14,647 వద్ద సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో 46.6 లక్షల షేర్లు చేతులు మారాయి. ఒక్కో షేరు విలువ రూ.87.30గా ఉంది.
స్వదేశీ టూవీలర్ కంపెనీ టీవీఎస్ కంపెనీ షేరు తొలిసారి రూ.2000 స్థాయిని అధిగమించింది. ఎం అండ్ ఎం కంపెనీ ఆర్మ్ క్లాసిక్ లెజెండ్స్‌లో రూ.875 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాలో 2.81 లక్షల షేర్లు చేతులు మారాయి. తన్లా ప్లాట్‌ఫామ్ షేర్లు 20 శాతం పెరిగి రూ.1110కి చేరుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్స్ తొలిసారి రూ.10,000 మార్క్ అందుకుంది.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709