365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 27,2024: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రవాణా ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “భారతదేశం ఆర్థికవేత్తగా, నిరాడంబరమైన గొప్ప మహానుభావుడిని కోల్పోయింది” అని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణం దేశానికి ఒక తీరని లోటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, దేశం యొక్క రూపురేఖలు మార్చిన మహానుభావుడి సేవలను ఎప్పటికీ మనం గుర్తుతెలియజేస్తాం” అని కొనియాడారు.
“దశాబ్దాలపాటు పాలనలో మన్మోహన్ సింగ్ విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని ఒక అమిత శక్తిగా తీర్చిదిద్దారు” అని ఆయన వివరించారు. ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం వంటి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ రూపాన్ని మార్చారని చెప్పారు.
“ప్రధాని మన్మోహన్ సింగ్ తో 15వ లోకసభలోనే ఎన్నో సమావేశాల్లో నేను పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేటప్పుడు నేతలందరినీ కలిసి పని చేయాలని ఆయన సూచించారు” అని ఆయన గుర్తు చేసారు.
“తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మన్మోహన్ సింగ్ ఇకలేరు అనే వార్త ప్రజలను తీవ్రంగా కలచివేస్తుంది. అయితే తెలంగాణ ప్రజల హృదయాలలో ఆయన చిరస్థాయిగా నిలుస్తారు” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.