365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్,జూలై 26,2024:అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా కంపెనీ ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జూలై 30న ప్రారంభమై ఆగస్టు 1న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ జూలై 29గా ఉంటుంది. 

ఈ ఇష్యూకి సంబంధించి ఒక్కో షేరు ధర శ్రేణి రూ. 646 నుంచి రూ. 679 వరకు ఉంటుంది. కనీసం 22 షేర్లకు అటుపైన 22 షేర్ల గుణిజాల్లో బిడ్లు దాఖలు చేయొచ్చు. ఈ ఇష్యూలో భాగంగా రూ. 680 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్‌హోల్డర్లు 1,73,30,435 షేర్ల వరకు విక్రయించనున్నారు.

అలాగే అర్హత గల ఉద్యోగుల కోసం రూ. 15 కోట్ల విలువ చేసే షేర్లు కేటాయించబడ్డాయి. తాజాగా జారీ చేసే షేర్ల ద్వారా సేకరించిన నిధులను (1) నిర్దిష్ట రుణాలను తిరిగి చెల్లించేందుకు, (2) అనుబంధ సంస్థలైన మ్యాక్స్‌క్యూర్ న్యూట్రావెడిక్స్ లిమిటెడ్,ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాల చెల్లింపునకు, (3) కంపెనీ అంతర్గత వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు (4) ఇతరత్రా సంస్థల కొనుగోలు ద్వారా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు (5) ఇతరత్రా కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించుకోనుంది.

ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లైన సంజీవ్ జైన్ 15,12,000 షేర్లను, సందీప్ జైన్ 15,12,000 షేర్లను, ఇన్వెస్టర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్ రూబీ క్యూసీ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ 1,43,06,435 షేర్లను విక్రయించనున్నాయి.

ఈ ఇష్యూకి ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, యాంబిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.