Sun. Dec 22nd, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 22,2024: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పాటించాల్సిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది.

వివిధ పంటలతో పాటు, మురుగునీటి నిల్వను అరికట్టడం, పురుగు మందులు పిచికారి వంటి వ్యవసాయ పనులపై విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్ రఘురామి రెడ్డి క్రింది సూచనలు చేశారు.

  • భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుంచి మురుగు నీటిని తీసివేయాలి.
  • రాబోవు మూడు రోజులలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారి చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి.
  • ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు,చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను.
  • రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు.పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.

వరి:-

  • నీరు సంవృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక (120-125 రోజుల) వరి రకాల నారుమళ్ళు జులై 31వ తేదీ వరకు పోసుకోవడానికి అనువైన సమయం.
  • 30,25 రోజుల వయస్సు ఉన్న మద్యకాలిక ,స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి.
  • దీర్ఘకాలిక వరి రకాల నారు భాగా ముదిరి (50రోజుల వయస్సు) ఆలస్యంగా నాటినప్పుడు ఆకు చివరలను త్రుంచి వేసి కుదురుల సంఖ్యను పెంచి కుదురుకు 6 నుంచి 8 మొక్కల చొప్పున నాటువేయాలి. నత్రజని ఎరువులను సిఫారసు కంటే 25శాతం పెంచి మూడు దఫాలుగా గాక రెండు దపాలుగా అంటే 70శాతం నాటే సమయంలో మిగతా 30శాతం అంకురం దశలో వేసుకోవాలి.
  • వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రా. కార్బోఫూరాన్ 3సిజి గుళికలను ఇసుకలో కలిపి చల్లి నట్లయితే ప్రధాన పొలంలో పంటను 15-20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చును.
  • ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం, వర్షాలను సద్వినియోగము చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్త పద్ధతిలో విత్తుకోవడము వలన సమయము,పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు.
  • నాటు పెట్టిన తర్వాత ప్రతి 2మీటర్లకు కాలిబాటను తీయటం వలన గాలి వెలుతురూ బాగా ప్రసరించడంతో బాటు సుడిదోమ ఉదృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు,పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది.
  • ముందస్తు చర్య నివారణ భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3 సిజి గుళికలను నాటిన 10 నుంచి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు,ఉల్లి కోడును నివారించుకోవచ్చును.

ప్రత్తి:-

  • ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా ,20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20 రోజుల,40 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం. మీ దూరంలో పాదులుతీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పవలెను.
  • ముంపుకు గురైన పంట త్వరగా కోలుకోవడానికి 19:19:19 లేదా 13-0-45 లేదా 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
  • నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళను నివారించుటకు 3గ్రా. కాపర్-అక్సీ-క్లోరైడ్ లేదా 2 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజేట్ శీలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
  • ప్రత్తి పంటలో వచ్చే గడ్డి జాతి,వెడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి (2 నుంచి 3 ఆకుల దశలో ఉన్న కలుపు మొక్కలు) 2 మి.లీ. క్విజలోఫాప్ ఇదైల్ + 1.25 మి.లీ. పైరిథాయోబ్యాక్ సోడియం కలుపు మందులను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మొక్కజొన్న:-

  • మొక్కజొన్న శాకీయ దశలో ఎక్కువ నీటిని తట్టుకోలేదు కాబట్టి పొలం నుంచి నీటిని వెంటనే తీసివేయాలి.
  • అధిక వర్షాల వలన నేలలో భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్ని ఊదారంగులోకి మారే అవకాశం ఉంటుంది. కావున వర్షాలు నిలిచిన తర్వాత 5 గ్రా. 19-19-19 లేదా 20 గ్రా డిఎపీ మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలి.
  • మొక్కజొన్న పంటను జులై 31వ తేదీ వరకు స్వల్పకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం.
  • మోకాలు ఎత్తుదశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం,9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవచ్చును.
  • వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత వర్షాధార పంటకు పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా,15 కిలోల పోటాప్ ను వేసుకోవాలి.

జొన్న

  • ముందస్తు నివారణ చర్యల భాగంగా జొన్నలో కాండం తొలుచు పురుగు నివారణకు, పంట విత్తిన 30-35 రోజుల దశలో ఎకరాకు 4 కిలోల కార్బోఫూరాన్ 3 సిజి గుళికలను కాండము సుడులలో వేయాలి.

కంది:-

  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో పైటాప్తోర ఎండుతెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినచో, నివారణకు 2 గ్రా. మెటలాక్సిల్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

సోయాచిక్కుడు

  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పంటలో వేరుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. తెగులు గమనించినచో, నివారణకు 3 గ్రా. కాపర్-ఆక్సి-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
  • సోయాచిక్కుడు పంటలో కాండం కుళ్ళు తెగులు గమనించినట్లయితే 2.5 గ్రా కార్బండాజిమ్ + మ్యాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల వలన 25 రోజుల పంటలో అంతరకృషి చేయడం వీలుకాని చోట 250 మి.లీ. ఇమాజితాపిర్ 10% SL లేదా 40గ్రా. ఇమాజితాపిర్ + ఇమాజమాక్స్ కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి గడ్డి మరియు వేడల్పాకు కలుపు జాతి మొక్కలను నివారించ వలెను.

వేరుశనగ

  • ప్రస్తత వాతావరణ పరిస్థితులు వేరుశనగలో మొదలుకుళ్ళు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొక్కల మొదళ్ళ దగ్గర 2గ్రా. కార్బండజిమ్ + మ్యాంకోజేట్ మందును లీటరు నీటికి కలిపి నేలను తడపాలి.

కూరగాయలు

  • టమాట, వంగ, మిరప,బంతి పంటల నారుమళ్ళలో నారు కుళ్ళు తెగులు నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీ-క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూరగాయల పంటలలో ఆకుమచ్చ తెగులు సోకుటకు, అనుకూలము. తెగులు నివారణకు 1 గ్రా. కార్బెండజిమ్ లేదా 1 మి.లీ. ప్రోపికోనజోల్ మందును లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.

చెరకు

  • ముంపుకు గురైయ్యే ప్రాంతాలల్లో ప్రతీ 25 మీటర్లకు ఊటకాలువలు ఏర్పాటు చేసుకొని తోటలో నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా నీటిని తీసివేయాలి.

Also read: Time to further enhance collaboration between the state governments and industry to uplift Oil Palm farmers

Also read: OPPO India Enters Record Books with the Reno12 Series for Most AI Avatars Created in a Day.

ఇదికూడా చదవండి:పారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న భారత జట్టుకు 8.5 కోట్లు ఇచ్చిన బీసీసీఐ.

error: Content is protected !!