Sun. Dec 1st, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 22,2024: ప్రపంచంలో అధిక జనాభా కలిగి ఉన్న భారతదేశం క్రీడల్లో వెనుకబడి ఉండడం శోచనీయం అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అన్నారు. అన్ని విద్యా విధానాలు క్రీడల ప్రాధాన్యతని నొక్కి చెబుతున్నప్పటికీ దానికి తగిన ఆచరణ ఉండటం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. రానున్న సంవత్సరాలలో విశ్వవిద్యాలయం బడ్జెట్ లో క్రీడలకి కేటాయింపులు పెంచడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాల క్రీడలు, ఆటల పోటీలు ముగింపు కార్యక్రమంలో ఉపకులపతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమం రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది.

క్రీడల వల్ల బృందస్ఫూర్తి, పాజిటివ్ దృక్పథం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ఆయన అన్నారు. తర్వాత విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ క్రీడల పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ ను బాలుర,బాలికల విభాగంలో వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ కైవసం చేసుకోగా, అథ్లెటిక్స్ ఇండివిడ్యుయల్ ఛాంపియన్షిప్ బాలుర,బాలికల విభాగంలో అశ్వరావుపేటకు చెందిన కె. అనిల్ కుమార్,ఎం. రచన కైవసం చేసుకున్నారు.

వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ లో గత నాలుగు రోజులుగా జరుగుతున్న విద్యార్థుల అంతర్ కళాశాల క్రీడలు,ఆటల పోటీలు నేటితో ముగిశాయి. ఈ క్రీడలలో 11 కళాశాలలకు చెందిన 415 మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ ముగింపు కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తదనంతరం యూనివర్సిటీ అబ్జర్వర్,హెడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డాక్టర్ జె. సురేష్ ఈ కార్యక్రమానికి సంబంధించిన సంక్షిప్త నివేదికను తెలియజేశారు.

కార్యక్రమంలో డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డాక్టర్ జె. సత్యనారాయణ, డీన్ ఆఫ్ కమ్యూనిటీస్ సైన్స్ డాక్టర్ వి. విజయలక్ష్మి, బోధన ,బోధ నేతర సిబ్బంది పాల్గొన్నారు. ఆఫీసర్ ఇంచార్జ్ స్టూడెంట్ అఫైర్స్, వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ డాక్టర్ పి. ప్రశాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

error: Content is protected !!