365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జనవరి 16,2025: వెండితెరపై మెరిసినా, రాజకీయ వేదికపై కనిపించినా, చిరంజీవి ఎక్కడ ఉన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. పొలిటిక్స్‌కు దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయం మాత్రం మెగాస్టార్‌ను వదిలిపెట్టలేదనే చెప్పాలి.
తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరోసారి చిరు కలవడం, రాజకీయ గాసిప్‌లకు ఊతమిచ్చింది.
ప్రధాని మోదీతో చిరంజీవి వారాల క్రితం జరిగిన కలయికపై చర్చలు ఊపందుకున్నాయి. గతంలోనూ నరేంద్ర మోదీ, చిరంజీవి కలిసి కనిపించిన సందర్భాలు మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధానితో చిరు కలవడం మరోసారి ఈ చర్చకు బలాన్నిచ్చింది.

వేడుకల్లో చిరుకు ప్రత్యేక గౌరవం:
కిషన్ రెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వంటి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కానీ, చిరంజీవికి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యం ప్రత్యేకంగా నిలిచింది.
మోదీ అప్యాయంగా చిరును ఆలింగనం చేసుకోవడం, లాంతరు వెలిగించే కార్యక్రమంలో చిరుకు ప్రత్యేక స్థానం ఇవ్వడం వంటి దృశ్యాలు సానుకూలంగా కనిపించాయి.
రాజ్యసభ సీటు ఆఫర్?
మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశముందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకించి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో మైలేజీ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా చిరు సేవలను వినియోగించుకునే యోచనలో ఉందన్న ప్రచారం ఊపందుకుంది.
ఈ సమయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేస్తున్న దృష్ట్యా, చిరు కూడా కాషాయ గూటికి చేరితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా వారి ప్రభావం మరింత పెరుగుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ, తన పేరును చర్చల కేంద్రంగా మార్చడం ఆగడం లేదు. చిరు బీజేపీలో చేరతారా? లేదా రాజ్యసభకు నామినేట్ అయ్యి తటస్థంగా కొనసాగుతారా? అనే ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
మరి మెగాస్టార్ తుది నిర్ణయం ఏమిటో.. ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.