365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 14,2023:దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం అదరగొట్టాయి. కనీవినీ ఎరగని రీతిలో జీవితకాల గరిష్ఠాలను తాకాయి.

కొత్త ఏడాదిలో వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ చెప్పడం ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ తగ్గడం, ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం శుభసూచకం.

డోజోన్స్ వంటి సూచీలు అత్యధిక స్థాయులకు చేరడంతో స్థానిక ఐటీ షేర్లు పరుగులు పెట్టాయి. తొలిసారిగా నిఫ్టీ 21,200, సెన్సెక్స్ 70500 స్థాయికి చేరాయి. నేడు మదుపరులు రూ.4 లక్షల కోట్ల మేర లాభపడ్డారు.

క్రితం సెషన్లో 69,584 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ 70,146 వద్ద మొదలైంది. ఆద్యంతం గరిష్ఠ స్థాయిలోనే చలించింది. 70,110 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకిని సూచీ 70,602 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది.

చివరికి 929 పాయింట్ల లాభంతో 70,514 వద్ద ముగిసింది. గురువారం 21,110 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 21,074 వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది.

21,210 వద్ద గరిష్ఠాన్ని తాకి మొత్తంగా 256 పాయింట్ల లాభంతో 21,182 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 640 పాయింట్లు ఎగిసి47,732 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ50లో 38 కంపెనీలు లాభపడగా 12 నష్టపోయాయి. ఇన్ఫీ, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్‌గా అవతరించాయి.

పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, నెస్లే ఇండియా, సిప్లా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అత్యధికంగా నష్టపోయాయి. నేడు మీడియా, కన్జూమర్, హెల్త్‌కేర్ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి.

బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు కళకళలాడాయి.

నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్‌ను గమనిస్తే 21,310 వద్ద సపోర్టు, 21,400 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి ఇన్ఫీ, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, క్యాస్ట్రాల్ ఇండియా షేర్లను కొనుగోలు చేయొచ్చు.

నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో రెండు భారీ ట్రేడ్స్ జరిగాయి. రూ.2470 శ్రేణిలో 35 లక్షల షేర్లు చేతులు మారాయి. ఫార్మా దిగ్గజం లుపిన్ చెన్నైలో సరికొత్త ప్రాంతీయ రిఫరెన్స్ ల్యాబ్ ఆరంభించింది.

నావల్‌గఢ్ ప్లాంటులో శ్రీ సిమెంట్ రోజుకు 11,500 టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తోంది. జైడస్ లైఫ్ సైన్సెస్ రూపొందించిన సైక్లోఫాస్ఫామైడ్ క్యాప్సూల్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది.

భారతీయ రైల్వే నుంచి ఓరియెంటల్ రైల్ ఇన్ఫ్రాకు ఆర్డర్ వచ్చింది. జీఎమ్మార్ ఎయిర్ పోర్ట్సులో 2.78 లక్షల షేర్లు చేతులు మారాయి. ఎల్‌టీ ఫైనాన్స్‌లో 36.7, ఎన్టీపీసీలో 10.2 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709