365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,మే 22,2022: పెట్రోల్,డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకు న్ననిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వాగతించారు. కేంద్రం బాటలో రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నడుచుకోవాలని సూచించారు.ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఈ నిర్ణయం ఊరట నిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బడుగు, మధ్యతరగతి ప్రజలకు కొంతమేలు జరిగే అవకాశం ఉందన్నారు.
డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్‌పై 200 సబ్సిడీ ఇవ్వడం వల్ల పేదలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని తాను నమ్ముతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. చమురు ధరలపై అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పన్నులు ఎక్కువగా ఉన్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. పెట్రోలు, డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.600 కోట్లు వసూలు చేస్తుందని పవన్ అన్నారు. రాష్ట్రంలో రోడ్డు మరమ్మతు పనులు సరిగా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.