365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అన్నవరం, జూన్ 13,2023:

  • వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ కత్తిపూడి కూడలిలో
  • ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో మమేకం
  • ప్రజల కష్టాలు.. బాధలు తెలుసుకొనేందుకు ‘జనవాణి’
  • అన్నవరం నుంచి నరసాపురం వరకూ షెడ్యూల్ ఖరారు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన వారాహి విజయ యాత్రకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం చేసుకొని ప్రజా క్షేత్రంలోకి వస్తారు. వారాహి నుంచి తొలి బహిరంగ సభను ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహిస్తారు. వారాహి వాహనం నుంచి పవన్ కళ్యాణ్ తొలి ప్రసంగం ఇవ్వబోయే తొలి గ్రామం కత్తిపూడి కానుంది. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు సమధికోత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

కత్తిపూడి నుంచి వారాహి విజయ యాత్ర ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా సాగుతుంది. పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుతుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

అదే విధంగా వివిధ సమస్యలతో సతమతమవుతూ కష్టాలుపడుతున్న ప్రజల బాధలు స్వయంగా తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి నియోజకవర్గంలో ‘జనవాణి’ కార్యక్రమం చేపడతారు. ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి సంబంధిత శాఖలకు ప్రజల ఇబ్బందులు, సమస్యలు తెలియచేసి పరిష్కారం కోసం పార్టీ పక్షాన ముందుకు వెళ్లాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ నాయకులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వారాహి యాత్ర, అనంతరం సభ నిర్వహిస్తారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

యాత్ర దిగ్విజయానికి వివిధ కమిటీలు

14వ తేదీ నుంచి మొదలయ్యే యాత్రను దిగ్విజయం చేసేందుకు వివిధ కమిటీలను నియమించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షులు, నాయకులతో పలు దఫాలు చర్చించి దిశానిర్దేశం చేశారు. ఏడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. నాయకులు, శ్రేణులు, వీర మహిళలు, ప్రజలను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగేలా ఈ కమిటీలు పని చేస్తాయి. వారాహి సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మెడికల్ టీం కూడా పని చేస్తుంది.

జనసేన వారాహి విజయ యాత్ర షెడ్యూల్.. ఇదే..!

14 జూన్ 2023 – వారాహి నుంచి ప్రత్తిపాడు నియోజకవార్గం కత్తిపూడిలో సభ
16 జూన్ 2023 – పిఠాపురంలో వారాహి యాత్ర. సభ
18 జూన్ 2023 – కాకినాడలో వారాహి యాత్ర. సభ
20 జూన్ 2023 – ముమ్మిడివరంలో వారాహి యాత్ర. సభ
21 జూన్ 2023 – అమలాపురంలో వారాహి యాత్ర. సభ
22 జూన్ 2023 – పి.గన్నవరం నియోజకవర్గం మీదుగా వారాహి యాత్ర.
రాజోలు నియోజకవర్గం మలికిపురంలో సభ
23 జూన్ 2023 – నరసాపురంలో వారాహి యాత్ర. సభ