365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 9, 2023:దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను రాజేసింది. ప్రపంచ మార్కెట్లలో నిరాశావాదం పెంచింది.
ముడిచమురు ధరలు ఒక్కరోజులోనే ఐదుశాతం మేర పెరగడంతో ద్రవ్యోల్బణం భయాలు మళ్లీ మొదలయ్యాయి. ఇవన్నీ ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంటకు దారితీశాయి. ఆసియాలో కొరియా, హాంకాంగ్, తైవాన్ సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఐరోపా, అమెరికా మార్కెట్లు మాత్రం విలవిల్లాడుతున్నాయి.
నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 141 పాయింట్లు తగ్గి 19,512 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 483 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.27 వద్ద స్థిరపడింది. మెటల్ రంగ షేర్లు భారీ పతనం చవిచూశాయి.
క్రితం సెషన్లో 65,995 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,560 వద్ద మొదలైంది. 65,434 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,789 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 483 పాయింట్లు తగ్గి 65,512 వద్ద ముగిసింది.
శుక్రవారం 19,653 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 19,539 వద్ద ఓపెనైంది. 19,480 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,588 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 141 పాయింట్లు తగ్గి 19,512 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 474 పాయింట్ల నష్టంతో 43,886 వద్ద క్లోజైంది.
నిఫ్టీ 50లో 7 కంపెనీలు లాభపడగా 43 నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ (1.13%), హెచ్‌సీఎల్ టెక్ (0.94%), టాటా కన్జూమర్ (0.56%), ఓఎన్జీసీ (0.41%), హిందుస్థాన్ యునీలివర్ (0.34%) టాప్ గెయినర్స్.
అదానీ పోర్ట్స్ (5.09%), హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ (2.68%), హీరోమోటో కార్ప్ (2.50%), ఎం అండ్ ఎం (2.19%), టాటా స్టీల్ (2.03%) టాప్ లాసర్స్. హెల్త్‌కేర్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. మీడియా రంగం ఏకంగా 2.18 శాతం పడిపోయింది.
నిఫ్టీ ఫ్యూచర్స్ అక్టోబర్ టెక్నికల్ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,500 వద్ద సపోర్టు, 19,650 వద్ద రెసిస్టెన్సీ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో హెచ్‌సీఎల్ టెక్, టాటా కన్జూమర్, ఎస్బీఐ, యూపీఎల్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.
నిఫ్టీ పతనంతో హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంకు కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. టీసీఎస్ రక్షించింది.
బయ్‌బ్యాక్ వార్తల నేపథ్యంలో టీసీఎస్ షేర్లు పెరిగాయి. 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సాధారణ బీమా కంపెనీల మార్కెట్లో న్యూ ఇండియా అష్యూరెన్స్ 13.09 శాతం వాటా దక్కించుకుంది. ఐసీఐసీఐ లాంబార్డ్ 8.67 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది.
నేడు ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఎరుపెక్కాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్, యూకో, సెంట్రల్ బ్యాంకు, పంజాబ్ సింధ్ ఐదు శాతానికి పైగా పతనమయ్యాయి. డెల్టా కార్ప్ షేర్లు 5.15 శాతం ఎగిశాయి. రెండు నెలల్లో ఇదే అత్యధిక పెరుగుదల. మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి రైల్ వికాస్ నిగమ్ రూ.394 కోట్ల విలువైన ఆర్డర్ సంపాదించింది.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709.