365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ 28, జనవరి 2025: పవర్ ట్రాన్స్‌మిషన్ సంస్థ కరమ్‌తారా ఇంజినీరింగ్ తమ రూ. 1,750 కోట్ల ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి (ఐపీవో) సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.

దీని ప్రకారం ప్రతిపాదిత ఐపీవో కింద రూ. 1,350 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద ప్రమోటర్లు రూ. 400 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా ప్రమోటర్లయిన తన్వీర్ సింగ్ మరియు రాజీవ్ సింగ్ చెరి రూ. 200 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తుతం 94.8 శాతం వాటాలు ఉన్నాయి.

తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,050 కోట్లను, రుణాల చెల్లింపునకు, కొంత భాగాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. పునరుత్పాదక శక్తి ,పంపిణీ లైన్ల రంగానికి సంబంధించిన ఉత్పత్తులను కరమ్‌తారా ఇంజినీరింగ్ తయారు చేస్తోంది.

విండ్ టర్బైన్ల కోసం ట్యూబ్యులార్ టవర్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు, ఇది 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రానున్నట్లు ప్రాస్పెక్టస్‌లో సంస్థ తెలిపింది.

2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 102.65 కోట్ల లాభాన్ని (PAT) ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 42.36 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు. ఆదాయాలు రూ. 1,600.31 కోట్ల నుంచి రూ. 2,425.15 కోట్లకు పెరిగాయి.