365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 13, 2022: దేశంలోనే ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) దేశంలోనే తొలిసారిగా వెయ్యి మూర్ఛ శస్త్రచికిత్సలు చేసిన ప్రైవేటు ఆస్పత్రిగా అసాధారణ రికార్డు సాధించినట్లు ఆదివారం ప్రకటించింది. ప్రతియేటా ఫిబ్రవరి రెండో సోమవారం అంతర్జాతీయ మూర్ఛ దినంగా పాటిస్తారు. ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ – న్యూఢిల్లీ), శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (త్రివేండ్రం) మాత్రమే ఇప్పటివరకు వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు పూర్తిచేశాయి.
మందులతో మూర్ఛవ్యాధి నయంకాని పిల్లలు, పెద్దలకు మాత్రమే శస్త్రచికిత్సల ద్వారా నయం చేస్తారు. మెదడులో మూర్ఛలు తరచు వచ్చే ప్రాంతాన్ని తొలగించేందుకు ఈ శస్త్రచికిత్స చేస్తారు. అయితే ఈ శస్త్రచికిత్సలే మూర్ఛవ్యాధిని నయంచేసే చికిత్సలో మొదటి అంకం కాదు. ముందుగా కనీసం రెండు రకాల మందులు వాడి, వాటితో సమర్థంగా నయం కానప్పుడే శస్త్రచికిత్స చేస్తారు.
కిమ్స్ ఆస్పత్రి వైద్యులు సాధించిన ఈ ఘనత గురించి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ సీతాజయలక్ష్మి మాట్లాడుతూ, ‘‘మూర్ఛ ఉన్న రోగుల్లో దాదాపు మూడోవంతు మందికి మందులతో నయం కాదు. దాన్ని డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ (డీఆర్ఈ) అంటారు. ఇలాంటివారిలో దాదాపు సగం మందికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. శస్త్రచికిత్స చేసేముందు రోగులకు కాంప్రిహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రాంలో నిశితంగా పరీక్షలు చేస్తాం. ముందుగా వారికి ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రాం (ఈఈజీ) రికార్డు చేసి, వాటిని ఎపిలెప్సీ మానిటరింగ్ ల్యాబొరేటరీలో పరిశీలిస్తాం. దీనివల్ల మూర్ఛ రకం, దాని కేంద్రం ఎక్కడో తెలుస్తుంది. ఇంకా 3టిఎంఆర్ఐ స్కాన్లు, పెట్ స్కాన్లు, ఎస్‌పీఈసీటీ స్కాన్లను కలిపి వాడితే అప్పుడు శస్త్రచికిత్స వల్ల ఫలితం ఉంటుందో లేదో తెలుస్తుంది’’ అని వివరించారు.
‘‘భారతదేశంలో ప్రతియేటా సుమారు 5 లక్షల మంది మూర్ఛ సమస్యతో పుడుతున్నారు. వారిలో కనీసం 10% మందికి ఈ సమస్య నయం చేయాలంటే శస్త్రచికిత్స అవసరం. కానీ దేశంలో ప్రతియేటా కేవలం 700 మాత్రమే మూర్ఛ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మన దేశంలో మూర్ఛ ఉన్నవారిలో శస్త్రచికిత్సకు అర్హత ఉన్న ప్రతి వెయ్యిమందిలో ఒక్కరు మాత్రమే ముందుకొస్తున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో దీనికి సంబంధించిన నిపుణులు ఉండటంతో పాటు, అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. వాటిలో న్యూరో నేవిగేషన్, స్టెల్త్ ఇమేజింగ్ సిస్టమ్స్, ఇంట్రా-ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, రోబోటిక్ సర్జరీ లాంటివి ఉన్నాయి. దీంతో అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా అంతర్జాతీయ స్థాయి విజయాల రేటుతో చేస్తున్నాం. ఇందులో సమస్యలు కూడా దాదాపు లేవు’’ అని కిమ్స్ ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ మానస్ పాణిగ్రాహి తెలిపారు.
మూర్ఛ శస్త్రచికిత్సలలో సాధిస్తున్న విజయాలకు గాను కిమ్స్ ఆస్పత్రిలోని కాంప్రిహెన్సివ్ ఎపిలెప్సీ కేర్ బృందాన్ని ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కరరావు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘మా ఆస్పత్రిలో దేశంలోనే అత్యుత్తమ న్యూరాలజీ బృందం ఉంది. వెయ్యి మూర్ఛ శస్త్రచికిత్సలు చేసిన మొట్టమొదటి ఆస్పత్రి అవ్వడం ద్వారా, కిమ్స్ ఆస్పత్రిలోని ఫిజిషియన్లు, సర్జన్లు మరోసారి తాము మార్గదర్శులుగా ఉంటామని నిరూపించారు. రోగులకు అత్యుత్తమ వైద్యం అందించడమే కాదు, తిరుగులేని రికార్డులూ స్థాపిస్తున్నారు’’ అని చెప్పారు.
మూర్ఛతో బాధపడే రోగులను ఈ సమాజం చూసే చూపులే వారికి అతిపెద్ద సమస్యగా మారుతున్నాయి. మూర్ఛ రోగులను కూడా సాధారణ మనుషుల్లాగే చూడాలి. ఈ సమస్య గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో ఎలా వ్యవహరించాలో కూడా చెప్పాలి. మూర్ఛ శస్త్రచికిత్స అనేది అడ్డంకి కాదు, శస్త్రచికిత్స చేయించుకున్నవారు ఆ తర్వాత సమాజంలో చాలా ఉన్నత శిఖరాలను అందుకున్నారు.