365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 13: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు కటాక్షించారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.
భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.