![](http://365telugu.com/wp-content/uploads/2022/03/ttd2-4.jpg)
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,మార్చి 27,2022:తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 30 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.00 నుంచి 9.00 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో
శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, ప్రధాన అర్చకులు శ్రీ ఎపి.ఆనందకుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
![](http://365telugu.com/wp-content/uploads/2022/03/ttd1-8.jpg)
మార్చి 29న అంకురార్పణ :
శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదినిపూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఆ వివరాలు ఇవీ…
తేదీ ఉదయం రాత్రి
30-03-2022 ధ్వజారోహణం(వృషభ లగ్నం) పెద్దశేష వాహనం
31-03-2022 చిన్నశేష వాహనం హంస వాహనం
01-04-2022 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం.
02-04-2022 కల్పవృక్ష వాహనం ఉగాది ఆస్థానం/ సర్వభూపాల వాహనం
03-04-2022 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
04-04-2022 హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
05-04-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
![](http://365telugu.com/wp-content/uploads/2022/03/ttd-12.jpg)
06-04-2022 రథోత్సవం అశ్వవాహనం
07-04-2022 చక్రస్నానం ధ్వజావరోహణం