365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,మే 25,2022: భువ‌నేశ్వ‌ర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ కార్యక్రమాల్లో భాగంగా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2-30 గంటల నుంచి సాయంత్రం 4-30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్ష‌ణ చేశారు.

అంత‌కుముందు ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పుణ్యాహవ‌చ‌నం, ర‌త్నాధివాసం, విమాన క‌ల‌శ స్థాప‌న‌, ర‌త్న‌న్యాసం, పీఠారోహ‌ణం, అష్ట‌బంధ‌నం, యాగ‌శాల వైదిక కార్యక్ర‌మాలు నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, రాత్రి 7 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు కుంభారాధ‌న, నివేద‌న‌, శ‌య‌నాధివాసం, హౌత్రం, స‌ర్వ‌దేవ‌తార్చ‌న‌, విశేష హోమాలు, యాగ‌శాలలో వైదిక‌ కార్య‌క్ర‌మాలు చేపట్టారు.