365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 24,2023: గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థులు సైతం నేడు ఉద్యోగం లేక నానాపాట్లు పడుతున్నారు. చదివిన సబ్జెక్టులపై సరైన అవగాహన లేక వెనుక బడుతున్నారు. విద్యార్థులకు కావాల్సింది మార్కులు కాదు, ప్రతిభ అని నిరూపించారు కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సరిపల్లి కొటిరెడ్డి. పట్టుదల, కృషి, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని చేసి చూపించారు.
టెన్త్ క్లాస్ క్యాలిఫికేషన్ తోనే మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ సాధించారు కోటిరెడ్డి. అక్కడితో ఆగిపోకుండా మరిన్ని ఉన్నత చదువులు చదివి..రూ.750 సంపాదనతో మొదలైన కోటిరెడ్డి ప్రస్తుతం రూ.1100కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు యజమాని అయ్యారు.
కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో..
కోటిరెడ్డి తల్లితండ్రులు కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులిచ్చారు. ఆ డబ్బు ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో కట్టి పీజీడీసీఏ (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లామా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్) కోర్సులో జాయిన్ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఆ ఇనిస్టిట్యూట్‌లోనే ఉండేవాడు. అలా ఆయన తక్కువ సమయంలోనే కంప్యూటర్ కోర్సులో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించారు.
ఆయన ప్రతిభను చూసిన ఆ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లోని అధ్యాపకులు ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు అదే ఇనిస్టిట్యూట్‌లో ఆయన డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరి కంప్యూటర్ పరిజ్ఞానంలో మరింత పట్టు సాధించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేరిన కోటి రెడ్డి నెల జీతం అప్పుడు రూ750. ఆ తర్వాత ‘సీ’ లాంగ్వేజ్ నేర్చుకొనేందుకు హైదరాబాద్‌కు చేరుకున్నారు.
కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో తాను కోర్సు నేర్చుకుంటూనే అక్కడికి వచ్చే విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇష్టపడిన కోర్సు కావడంతో ఎన్నిరకాల ఇబ్బందులు ఎదురైనా కోటిరెడ్డి వెనుతిరగలేదు.
https://www.youtube.com/watch?v=p7IfwZQk_3A
దేశంలోనే తొలి వ్యక్తి ..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాణించాలన్న పట్టుదల కోటిరెడ్డిలో మరింతగా పెరిగింది. అందుకోసం ఆయన ఆహర్నిశలూ శ్రమించారు. 2004లో కోటిరెడ్డికి మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ గురించి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ 12 రౌండ్లు ఇంటర్వ్యూ చేశారు. అన్నిరౌండ్లలో ఆయనే ముందున్నారు.
ఆ తర్వాత ‘యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ జాబ్ ’ అంటూ కోటిరెడ్డికి ఫోన్ వచ్చింది. సర్టిఫికెట్లు కావాలి. కోటిరెడ్డి దగ్గర పదోతరగతి సర్టిఫికేట్లు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో ఆయనకు తెలియలేదు. కొద్దిసేపటి తర్వాత మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ నుంచి మరోసారి ఫోన్. ఇంటర్వ్యూలో అందరికంటే ఎక్కువ మార్కులు మీకే వచ్చాయి.
విద్యార్హత లేకపోయినా పర్వాలేదు ఉద్యోగంలో జాయిన్ అవ్వొచ్చని చెప్పారు. భారతదేశంలో పదో తరగతి చదువుతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సంపాదించిన మొదటి వ్యక్తి కోటిరెడ్డే. అది మన తెలుగువ్యక్తి కావడం గర్వించదగ్గ విషయం. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో ‘యాప్ ఆర్కిటెక్ కోర్’ టీమ్‌తో కలిసి పనిచేసే అవకాశం కోటిరెడ్డికి వచ్చింది.
https://www.youtube.com/watch?v=p7IfwZQk_3A
పుట్టిన దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్షతో……
కోటిరెడ్డి అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పదేండ్ల పాటు ఉద్యోగం చేశారు. పుట్టిన దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్ష స్వదేశానికి వచ్చేలా చేసింది. సొంతగా కంపెనీలు పెట్టి లక్షలాదిమందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 2014లో ‘కోటీ గ్రూప్ ఆఫ్ వెంచర్స్’ నుస్థాపించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ సేవలందించేందుకు కంపెనీలను స్థాపించారాయన. ప్రస్తుతం భారత్ ఇన్నోవేషన్స్, భారత్ హెల్త్‌కేర్, డిజిటల్ ఎడ్యుకేషన్, డీజెడ్ పే, ఈ-గుడి, క్రౌడ్ బ్లడ్, సిట్రస్ క్లినిక్ వంటి 14 కంపెనీలున్నాయి. వైద్యం, విద్య వంటి కనీసవసరాలు అందక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
అటువంటి వారికి సరైన పరిష్కారం అందించాలనే ఆలోచనతోనే కోటిరెడ్డి హెల్త్‌కేర్, విద్యారంగంలో సేవలందించేం దుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు సరైన విద్యా,వైద్యం అందక ఆయన కూడా ఎన్నో బాధలు పడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకొని తనలా మరెవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సేవలందిం చాలనుకున్నారాయన. అందుకోసమే ఈ రెండు రంగాల ద్వారా సేవలు అందించడం మొదలు పెట్టారు కోటిరెడ్డి.
కోట్ల మందికి సేవలు..
ప్రస్తుతం ఆయన ప్రారంభించిన సంస్థల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 238 దేశాల్లోని 784 కోట్ల మంది సేవలు పొందుతున్నారు. ధనికులకే కాదు,పేదవారికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కోటిరెడ్డి అనేక పరిశోధనలు జరుపుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే పలు ఇన్నోవేషన్స్‌ను ప్రవేశపెట్టారు.
సంపాదించిన దాంట్లో 33శాతం సేవకే..
సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కోటిరెడ్డి. ఆయన సంపాదించిన దాంట్లో 33 శాతం సేవకే ఖర్చుచేస్తున్నారు. తనవంతు సేవ చేయడానికి ‘సేవా ఫౌండేషన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.
దీని ద్వారా పేద విద్యార్థులు, నిరాశ్రయులైన వయోవృద్ధులకు సాయం అందిస్తున్నారు. జనార్థనపురం, నందివాడల్లోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను దత్తత తీసుకొని మౌలికసదుపాయాలు కల్పిస్తునారు.
గ్రామీణ ప్రాంత బడుల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేసి, మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. సర్కారీ బడులను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా మరికొన్ని కంపెనీలను ప్రారంభించే పనిలో ఉన్నారు కోటిరెడ్డి.