365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,తిరుపతి,నవంబర్14,2023:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళ, బుధవారాల్లో జరుగనున్న గజ,గరుడ వాహనసేవల్లో అలంకరించేందుకు తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని మంగళవారం ఉదయం శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని, నవంబర్ 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు.
మంగళవారం అమ్మవారికి ప్రీతిపాత్రమైన గజవాహన సేవ జరగనుందని, ఇందుకోసం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాసులహారాన్ని ఊరేగింపుగా తిరుచానూరుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.
ముందుగా తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి ఈ హారాన్ని ఆలయ నాలుగు వీధుల్లో శోభాయాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు.
తిరుమలలో జరిగిన కార్యక్రమంలో ఈవో శ్రీ ఏవి. ధర్మారెడ్డి,ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం, విజివో నంద కిషోర్, పేష్కార్ శ్రీహరి పాల్గొన్నారు.
తిరుచానూరులో ….
అనంతరం తిరుమల నుండి వాహనంలో భద్రత నడుమ తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం కాసులహారాన్ని అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ కు అందజేశారు.
అక్కడ హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణగా గర్భాలయంలోకి తీసుకెళ్లి మూలమూర్తికి అలంకరించారు.
ఈ కార్యక్రమంలో విజివో బాలిరెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
- పంచమితీర్థం నాడు విచ్చేసే భక్తులకు విస్తృత ఏర్పాట్లు : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
- తిరుచానూరుకు చేరిన లక్ష్మీకాసులహారం